పింఛన్ల ఎంపికకు గైడ్‌లైన్స్ విడుదల అర్హులు, అనర్హులపై స్పష్టతనిచ్చిన సర్కారు ఈనెల 15న కొత్త లబ్ధిదారుల ఎంపిక
కుటుంబంలో 3 ఎకరాలకు మించి తరి (నీటిపారుదల) భూమి లేదా 7.5 ఎకరాలకు మించి మెట్ట (పొడి) భూమి ఉన్నవారు.
కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేటు రంగం, ఔట్‌సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నవారు.
దరఖాస్తుదారుల పిల్లలు వైద్యులు, కాంట్రాక్ట ర్లు, వృత్తి నిపుణులు, ఉన్నతస్థాయి స్వయం ఉపాధిలో ఉంటే.
పెద్ద వ్యాపార సంస్థలు, ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, పెట్రోల్ బంకులు, పెద్ద దుకాణాల యజమానులు.
ఇప్పటికే ప్రభుత్వ పింఛను లేదా స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పొందుతున్నవారు.
నాలుగు చక్రాల వాహనాలు(కార్లు, జీపులు), భారీ వాహనాలు(ట్రాక్టర్లు, లారీలు తదితర) ఉన్నవారు.
కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతా ల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటినవారు.
జీవనశైలి, వృత్తి, ఆస్తుల ఆధారంగా కుటుంబం అనర్హమని విచారణ అధికారి భావిస్తే పింఛను నిరాకరించే అవకాశం ఉంది.
నిర్మల్‌చైన్‌గేట్: అర్హులైన నిరుపేదలకు అందించే చేయూత పింఛన్ల మంజూరుకు కొత్తగా దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, డీఆర్డీవోలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో పింఛన్ ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్ లాగిన్ ఓపెన్ అయింది. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆగస్టు 15 నాటికి అర్హులను ఎంపిక చేసి, సెప్టెంబర్ నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ప్రస్తుతం జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో 1,44,773 మంది చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు.
నూతన ఫార్మాట్‌లోనే దరఖాస్తులు
పింఛన్ కోసం అర్హులు గతంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారు. అవన్నీ బుట్టదాఖలయ్యాయి. తాజాగా ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఫార్మాట్‌లోనే దరఖాస్తు చేయాలని తెలిపింది. గతంలో ప్రజాపాలన, మీసేవ కేంద్రాల్లో లేదా సాధారణ తెల్లకాగితాలపై దరఖాస్తు చేసినవారు కూడా ఇప్పుడు ప్రభుత్వం విడుదల చేసిన కొత్త ఫార్మాట్‌లోనే వివరాలు సమర్పించాలి. గతంలో దరఖాస్తులతోపాటు ఇచ్చిన కులం, ఆదాయం, ఇతర ధ్రువీకరణ పత్రాలకు ఈ కొత్త దరఖాస్తు ఫారాన్ని జతచేసి సమర్పించాలి. ఆన్‌లైన్ నమోదుకు వీలుగా దరఖాస్తుదారుని బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, సమగ్ర వ్యక్తిగత వివరాలను ఈ ఫారంలో పొందుపరిచారు.
ఎక్కడ దరఖాస్తు చేయాలి
గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీలు, ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలి. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో స్వీకరించిన దరఖాస్తులను ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పరిశీలించి ఆన్‌లైన్ లాగిన్‌లో నమోదు చేస్తారు. అనంతరం ఆ ఫైళ్లను డీఆర్డీవో ద్వారా కలెక్టర్ పరిశీలనకు పంపి, తుది ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపుతారు.
అర్హులు వీరు..
వితంతువులు (రూ.2,016): 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. భర్త మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.
ఒంటరి మహిళలు(రూ.2,016): వివాహిత మహిళలైతే 18 ఏళ్లు నిండి, భర్త నుంచి విడిపోయి లేదా భర్త వదిలివేసిన పరిస్థితిలో ఉండాలి. విడిపోయిన కాలం ఏడాదికి పైబడి ఉండాలి. అవివాహిత మహిళలకు గ్రామీణ ప్రాంతాల్లో 30 ఏళ్లు, పట్టణ ప్రాంతాల్లో 35 ఏళ్లు నిండి ఉండాలి. పంచాయతీ కార్యదర్శి లేదా వార్డు అధికారి ధ్రువీకరణ అవసరం.
గీత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. టాడీ ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీలో సభ్యత్వం, ఎకై ్సజ్ శాఖ ధ్రువీకరణ అవసరం.
చేనేత కార్మికులు (రూ.2,016): 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు ఉండాలి. హ్యాండ్‌లూమ్స్, టెక్స్‌టైల్స్ శాఖ నుంచి ధ్రువీకరణ పొందాలి.
దివ్యాంగులు (రూ.4,016): వయసుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం అంగవైకల్యం ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారికి 51 శాతం ఉండాలి. ఇందుకు ఆన్‌లైన్ విధానంలో జారీ చేసిన యూడీఐడీ, సదరం ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.
ఫైలేరియా బాధితులు (రూ.2,016): వయసుతో సంబంధం లేదు. గ్రేడ్–2, గ్రేడ్–3 ఫైలేరియా బాధితులు అర్హులు. డీఎంహెచ్‌వో ద్వారా ధ్రువీకరణ అవసరం.
డయాలసిస్ రోగులు (రూ.2,016): వయసుతో సంబంధం లేదు. డయాలసిస్ చికిత్స పొందుతున్నవారు అర్హులు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా నమోదు, ధ్రువీకరణ అవసరం.
వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేదు
కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి మార్గదర్శకాలు వెలువడినా వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేదు. కొత్తగా అర్హత పొందే వృద్ధులకు వయోపరిమితి ఎంత అనే అంశాలపై మార్గదర్శకాల్లో వివరాలు లేకపోవడంతో అయోమయం నెలకొంది. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
వీరు అనర్హులు
మండలాల వారీగా లబ్ధిదారులు..
మండలం లబ్ధిదారుల సంఖ్య
బాసర 2,851
భైంసా 8,039
ౖభైంసా మున్సిపాలిటీ 7,794
దస్తురాబాద్ 3,601
దిలావర్‌పూర్ 5,990
కడెం 7,243
ఖానాపూర్ 6,761
ఖానాపూర్ మున్సిపాలిటీ 3,904
కుభీర్ 9,251
కుంటాల 5,610
లక్ష్మణచాంద 7,906
లోకేశ్వరం 9,448
మామడ 6,511
ముధోల్ 6,181
నర్సాపూర్(జి) 5,814
నిర్మల్ రూరల్ 7,017
నిర్మల్ మున్సిపాలిటీ 14,847
పెంబి 1,794
సారంగాపూర్ 11,587
సోన్ 7,022
తానూరు 5,602


