చినుకుపడే వేళలో.. చిందేస్తున్న జలపాతాలు నేలంతా పచ్చగా.. మనసంతా హాయిగా.. ఆహ్వానిస్తున్న పర్యాటక ప్రదేశాలు.. జాగ్రత్తగా చూసొద్దాం..
నిర్మల్: ‘వావ్.. అటు చూడు.. వంపుల ఒంపుసొంపులతో ‘సహ్యాద్రి’ పచ్చనికోక కట్టినట్లు ఎంత అందంగా ఉందో.. అదిగదిగో.. అక్కడ.. కనిపిస్తోందా.. ‘కడెం’ నిండుకుండలా ఎలా తొణకిసలాడుతోందో..! ఆ దిక్కు చూడు గలగలా గోదారి కొత్తనీళ్లతో ఎలా ఉరుకులు తీస్తోందో..! అక్కడ చూడు.. అంతెత్తు నుంచి వాస్తాపూర్ జలపాతం ఎలా జాలువారుతోందో.. అసలు.. ఉట్టిగనే అలా.. కాసేపు ఖానాపూర్ వైపో లేదంటే ఆదిలాబాద్ ది క్కునో వెళ్లిచూడు.. మనసుకు హాయినిచ్చే పచ్చద నం వెంటే వస్తుంది. ఇటీవల కురిసిన వానలకు పురివిప్పిన ప్రకృతి తన అందాలతో ప్రకృతి ప్రే మికులను కనువిందు చేస్తోంది. సహజసిద్ధమైన ఎన్నో ప్రకృతి అందాలున్న జిల్లా ఈ సీజన్‌లో మ రింత సొగసులు అద్దుకుంటుంది. కాస్త ఓపికతో పాటు జర.. జాగ్రత్తగా అలా అడుగు బయటపెడితే మన చెంతనే ఈ అందాలను ఆస్వాదించవచ్చు.
జాగ్రత్తలు తప్పనిసరి..
పచ్చని ప్రకృతి అందాల వీక్షణానికి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలూ తప్పనిసరి. వర్షాకాలం కనుక జలపాతాలు, వాగుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లు పడే ప్రాంతంలో, దిగువ ప్రాంతంలో నీళ్లల్లో ఉండొద్దు. ఎప్పుడు పైనుంచి వరద పెరుగుతుందో చెప్పలేం. స్థానికం వర్షం కురిసినా, కురవకపోయినా.. ఎగువ నుంచి వచ్చే వరదతో జలపాతం ఉప్పొంగవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. పచ్చని ప్రదేశాల్లో పాములు, తేళ్లు ఉండే అవకాశాలు ఎక్కువ. కాసింత ఆచితూచి అడుగులు వేసుకుంటూ వెళ్తేనే మంచిది. మనం వెళ్లే ప్రాంతంతో ఎంతోకొంత పరిచయం ఉన్నవాళ్లను వెంట తీసుకెళ్లడం ఉత్తమం.
వాస్తాపూర్ జలపాతం
వాస్తాపూర్ జలసౌందర్యం...
ప్రకృతి ఒడిలో జాలువారే జలసౌందర్యం.. వాస్తాపూర్ జలపాతం. నిర్మల్ నుంచి మామడ మండలంలోని తాండ్ర గ్రామం మీదుగా వాస్తాపూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్–44 బైపాస్ నుంచి కేవలం 5 కి.మీ. మాత్రమే ఉంటుంది. నిర్మల్ నుంచి 20 కి.మీ. వరకు వస్తుంది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కాస్త జాగ్రత్తగా ఉంటే అక్కడి అందాలను ఆస్వాదించవచ్చు. ఎన్‌హెచ్–44పై తాండ్ర గ్రామం నుంచి ఆదిలాబాద్ వైపు ఇంకాస్త ముందుకు వెళ్తే నేరడిగొండ మండలంలోని కొరటికల్, కుంటాల జలపాతాలనూ చూడొచ్చు.
ఒంపుసొంపుల అందాలు..
హైదరాబాద్–నాగపూర్ దారిలో ఎన్‌హెచ్–44పై వెళ్తుంటే.. నిర్మల్ జిల్లాకేంద్రానికి 10–12కి.మీ. దూరంలో సహ్యాద్రి పర్వతాల చివరి సానువులు పరిచయం చేసుకుంటాయి. ఒంపులు తిరిగే ఘాట్‌రోడ్డు, చుట్టూ పచ్చని, ఎత్తయిన చెట్లతో ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతితోపాటు సాహసయాత్రలను ఇష్టపడే పర్యాటకులు, సందర్శకులకు ఈ రహదారి ఆహా.. అనిపిస్తుంది. ఘాట్‌రోడ్డు ప్రారంభంలోనే కొంత దూరంలో ఇటీవల బాహుబలి పేరిట ఓ పొడవాటి జలపాతాన్ని గుర్తించారు. కానీ.. అది కేవలం వర్షం ఎక్కువగా కురిసినప్పుడే పారుతుంది. ఈమధ్య ఇక్కడికి అటవీ అధికారులు వెళ్లనివ్వడం లేదు. ఘాట్‌రోడ్డు మధ్యలో ఉన్న వాచ్‌టవర్ వద్ద నుంచి కిందికి వీక్షిస్తే.. పచ్చని అటవీ అందాలు మనసుకు ఎంతో హాయినిస్తాయి. కాస్త జల్లులు పడి, పొగమంచు కురుస్తున్నట్లుగా ఉన్న వేళ.. అలా సహ్యాద్రి మార్గంలో వెళ్తుంటే కశ్మీర్‌ను తలపిస్తుంది.


