ఖానాపూర్: గోసంపల్లె గ్రామ పంచాయతీ కోర్టుకెక్కింది. జనాభా రికార్డుల్లో నెలకొన్న వ్యత్యాసాల ను సరిచేసి, గ్రామపంచా యతీకి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సర్పంచ్ కొక్కుల సుభద్ర హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు 2026, మే 4న రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
జనాభా లెక్క తేల్చాలని..
పిటిషన్‌లో 2011 జనాభా లెక్కలు, 2019 గెజి ట్ నోటిఫికేషన్ తదితర అధికారిక రికార్డులకు అనుగుణంగా గోసంపల్లె గ్రామపంచాయతీ జనాభా వివరాలను సరిచేసేలా ఆదేశించాలని కోరారు. జనాభా రికార్డులను సరిచేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీంతో గ్రామపంచాయతీకి రావాల్సిన నిధులపై ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. జనాభా వివరాలను సవరించిన అనంతరం 2019 నుంచి ఇప్పటి వరకు గ్రామపంచాయతీకి రావాల్సి న ఆర్థిక సంఘం గ్రాంట్లు, సాధారణ, ప్రత్యేక గ్రాంట్లతోపాటు ఇతర బకాయిలను మళ్లీ లెక్కించి విడుదల చేయించాలని సర్పంచ్ కోర్టును కోరారు. ఆలస్యమైన కాలానికి తగిన వడ్డీని కూడా చెల్లించేలా అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతివాదులుగా ప్రభుత్వ యంత్రాంగం
ఈ కేసులో తెలంగాణ పంచాయతీరాజ్, గ్రామీ ణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్, నిర్మల్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఖా నాపూర్ ఎంపీడీవో తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. గ్రామానికి న్యాయంగా రావాల్సిన నిధులు అందేలా జనాభా రికార్డులను సరిచేయాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని సర్పంచ్ కొక్కుల సుభద్ర తెలిపారు.


