1956లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా భైంసా..
భైంసాటౌన్: భైంసా పట్టణం 1956లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణంలో 11,750 నివాస గృహాలు, 50,134 మంది జనాభా ఉండేది. ప్రస్తుతం 14,730 గృహాలు, 53,374 మంది జనాభా ఉన్నారు. భైంసా పట్టణం 35.11 చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉండగా, భైంసా నుంచి నిర్మల్, నిజామాబాద్, మహారాష్ట్రలోని భోకర్, ఇతర ప్రాంతాలకు ప్రధాన మార్గాలున్నాయి. పట్టణానికి పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా భోకర్ తాలూకా, దక్షిణాన నిజామాబాద్ జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. పట్టణంలో మొత్తం 26వార్డులుండగా, 51,118 మంది ఓటర్లున్నారు. వీరిలో 25,486 మంది పురుషులు, 25,623 మంది మహిళలు, తొమ్మిదిమంది ఇతరులున్నారు. పట్టణానికి ఆనుకుని రెండు కిలోమీటర్ల దూరంలో మిర్జాపూర్ మార్గంలో గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఉండగా, పట్టణానికి ఇదే తాగునీటి ఆధారంగా ఉంది. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే రెండో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కలిగి ఉంది. పత్తి పరిశ్రమలూ ఇక్కడ అధిక సంఖ్యలోనే ఉన్నాయి. లక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, అయ్యప్ప ఆలయం, మహదేవ్ మందిర్, గట్టు మైసమ్మ ఆలయాలున్నాయి.


