పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నిర్మల్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పూర్తి చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని, హెల్ప్‌డెస్క్‌లనూ ఏర్పాటు చేశామని చెప్పారు. ఎన్నికల నిర్వహణపై సందేహాలు ఉంటే తమను సంప్రదించవచ్చని సూచించారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం సజావుగా పూర్తి చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు.
కంట్రోల్‌రూమ్‌లో అప్రమత్తంగా ఉండాలి
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో ఏర్పా టు చేసిన కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాషఅభినవ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని కంట్రోల్‌రూమ్‌ను తనిఖీ చేశారు. నామినేషన్ కేంద్రాలను వెబ్‌కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించి, అధికారులకు సూచనలు చేశారు.
హెల్ప్‌లైన్..9100577132
ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలి పారు. ఎవరైనా 9100577132 నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని సూచించారు. కంట్రోల్ రూమ్‌కు వచ్చే ప్రతి ఫోన్‌కాల్‌ను సిబ్బంది స్వీకరించాలని, ఫిర్యాదుల వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేసి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
మీడియా సెంటర్ ప్రారంభం..
ఎన్నికలకు సంబంధించి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చే రాజకీయ వార్తలపై నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో మీడియా సర్టిఫికెట్ అండ్ మానిటరింగ్ కమిటీ (మీడియా సెంటర్)ని ప్రారంభించారు. రోజువారీగా వార్తపత్రికలు, చానళ్లలో వచ్చే వార్తలను నిశితంగా గమనించాలన్నారు. పెయిడ్‌న్యూస్ వివరాలు నమోదు చేయాలని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలపై నిఘా ఉంచాలని తెలిపారు. కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ కిశోర్‌కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, డీపీఆర్వో విష్ణువర్ధన్, ఈడీఎం నదీమ్ పాల్గొన్నారు.


