‘మధ్యాహ్నం’ మెరుగుపడాలి
ఎండీఎం అమలులో జిల్లాకు 16వ ర్యాంకు 74.6 శాతం మంది విద్యార్థులకే భోజనం
లక్ష్మణచాంద: తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. మౌలిక వసతులు, ప్రయోగశాల పరికరాలకు నిధులు కేటాయించారు. వంటగదుల నిర్మాణానికి కలెక్టర్లు ఇటీవల నిధులు మంజూరు చేయించారు. ఇది పాఠశాల వాతావరణాన్ని మెరుగుపరుస్తుంది.
మధ్యాహ్న భోజనం పారదర్శకతకు..
మధ్యాహ్న భోజన పథకంలో పారదర్శకతను మరింత పెంచేలా విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్రవ్యాప్తంగా అమలు తీరుపై సర్వే చేపట్టింది. ఇందులో జిల్లా 16వ స్థానం సాధించింది. జిల్లాలో 74.6% విద్యార్థులు రోజూ భోజనం చేస్తున్నట్లు తేలింది. నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించి ర్యాంక్ మెరుగుపర్చాలని స్థానికులు కోరుతున్నారు.
క్షేత్ర స్థాయి సవాళ్లు..
సర్వేలో 12 అంశాలపై పరిశీలన జరిగింది. ఆహార కమిటీలు నాణ్యత తనిఖీ చేయకపోవడం, స్టీరింగ్ కమిటీల పరిశీలన లోపాలు, కట్టెల పొయ్యిపై వంటలు చేయడం వంటి సమస్యలు బయటపడ్డాయి. ఇవి అమలులో లోపాలను సూచిస్తున్నాయి. మధ్యాహ్న భోజనం నిత్యం ముందుగా ఆహార కమిటీ భోజన నాణ్యతను పరిశీలించిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. కానీ ఇది క్షేత్రస్థాయిలో చాలా చోట్ల ఆచరణలో లేదన్నట్టుగా తెలుస్తుంది. ప్రతీ మండలంలో స్టీరింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలు ఉన్నా పరిశీలన సరిగా చేయడం లేదని సమాచారం. జిల్లాలోని పలు పాఠశాలల్లో ఇప్పటికీ కట్టెల పొయ్యి మీదనే మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు.
తనిఖీలు, మానిటరింగ్..
ఎంఈవోలు ప్రతిరోజూ పాఠశాలలు సందర్శించి భోజన నాణ్యతను పరిశీలిస్తున్నారు. పరిశీలనలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఇది పథకం సమర్థతను పెంచుతుంది. మెరుగైన అమలుతో విద్యార్థుల హాజరు, పోషకాహారం మెరుగుపడతాయి.
నాణ్యత పెంచాలి..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలి. ప్రతీ పాఠశాలలో తయారుచేసిన మధ్యాహ్న భోజనాన్ని విధిగా ఆహార కమిటీ వారు రుచిచూసిన తర్వాతనే విద్యార్థులకు అందించాలి. ప్రతీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీనిని బాధ్యతగా తీసుకోవాలి. మధ్యాహ్న భోజనం సరిగా అమలు అయ్యేలాగా చూడాలి.
– భోజన్న, డీఈవో
‘మధ్యాహ్నం’ మెరుగుపడాలి


