భైంసా.. మినీ భారత్..!
భైంసాటౌన్: మున్సిపల్‌తోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న భైంసా పట్టణం భిన్న సంస్కృతి, సంప్రదాయాలు, భాషలకు నిలయం. వివిధ మతాలు, సంస్కృతులు, భాషలు మాట్లాడే ప్రజలు కలిసి నివసించే వైవిధ్యమైన, చారిత్రక ప్రాధాన్యత ఉన్న పట్టణం. అందుకే మినీ భారత్‌గా పేర్కొంటారు. ఇక్కడ ఎక్కువగా తెలుగు, మరాఠీ, హిందీ, ఉర్దూ భాషలు మాట్లాడే ప్రజలు నివసిస్తున్నారు. పత్తి పరిశ్రమలకు పెట్టింది పేరు కాగా, నియోజకవర్గానికి వాణిజ్య కేంద్రంగా కొనసాగుతోంది. గతంలో నగర పంచాయతీగా ఉన్న భైంసా పట్టణం తొలుత నిజాం రాజ్యంలో కొనసాగింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో భాగంగా ఉండేది. 1953లో భాషా ప్రయుక్త రాష్ట్రాల విభజనతో భైంసా పట్టణం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసింది. ఆపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. 1956లోనే తొలుత నాలుగు రెవెన్యూ వార్డులతో గ్రేడ్–3 మున్సిపల్‌గా ఏర్పడగా, 1995లో 17, 2005లో 20, 2014లో 23 వార్డులకు పెరగగా, 2019లో 26 వార్డులకు చేరింది. ప్రస్తుతం పట్టణంలో 51,118 మంది ఓటర్లు ఉన్నారు.
త్రిభాషా సంగమం...
భైంసా పట్టణంలో ప్రధానంగా హిందూ సామాజికవర్గంతోపాటు ముస్లింలు అధిక సంఖ్యలో ఉంటారు. మహారాష్ట్రకు సరిహద్దున ఉండడంతో ఇక్కడ మరాఠీ భాష మాట్లాడేవారు కూడా అధికంగానే ఉంటారు. తెలుగు, మరాఠీ, ఉర్దూ భాషల సంగమం ఇక్కడ కనిపిస్తుంది. కర్ణాటకకు చెందిన బసవేశ్వర ఆరాధకులు సైతం ఇక్కడ కనిపిస్తారు. ఇక, వ్యాపారాల నిమిత్తం గుజరాత్, రాజస్థాన్ నుంచి వలస వచ్చి ఇక్కడే స్థిరపడినవారూ ఉన్నారు. భైంసా పట్టణం పత్తి పరిశ్రమల కేంద్రంగా ఉండగా, క్రమేణా పత్తి ఫ్యాక్టరీలు మూతపడి ప్రస్తుతం పదుల సంఖ్యకు పరిమితమయ్యాయి. ఇక్కడి ప్రజలు అధికసంఖ్యలో వ్యవసాయంపై ఆధారపడినవారున్నారు.
సున్నిత ప్రాంతంగా..
గతంలో జరిగిన మతపరమైన అల్లర్లతో భైంసా ప ట్టణం రాష్ట్రంలోనే సున్నితప్రాంతంగా అపఖ్యాతిని పొందింది. 1984 నుంచి పలుమార్లు అల్లర్ల ఘటనలు చోట చేసుకోగా, అప్పటి నుంచి అత్యంత సున్ని తప్రాంతంగా మారింది. 2008, 2020, 2021లో నూ ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో అభివృద్ధిపరంగా కాస్త వెనుకబడిన ప్రాంతంగా మారింది. భైంసా పట్టణం మున్సిపల్ కేంద్రంగా ఉండడంతోపాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. ఇక్కడ సబ్ కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి, ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి అందుబాటులో ఉన్నారు.
మహిష నుంచి భైంసాగా...
దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడంతో మహిషాగా పిలవబడిందని చరిత్ర చెబు తోంది. దీనికి నిదర్శనంగా గట్టు మైసమ్మ ఆ లయం సమీపంలో ఫిల్టర్‌బెడ్ ప్రాంతంలో మహిషాసుర రాతి పాదాలు కనిపిస్తాయి. కా లక్రమంలో మహిష మైసగా, ప్రస్తుతం భైంసాగా మారింది. ఈ పట్టణంలో కళ్యాణి చాళుక్యుల కాలం నాటి గోపాలకృష్ణ మందిర్ వంటి పురాతన నిర్మాణాలు ఉన్నాయని చరిత్ర.


