ఎన్నికలు సజావుగా నిర్వహిస్తాం
భైంసాటౌన్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. ఎస్పీ జానకీ షర్మిలతో కలిసి బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వార్డుల వారీగా ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు పరిశీలించారు. ఎన్నికల నియమావళి పాటిస్తూ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ జానకీ షర్మి ల మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని భద్రత చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంతోపాటు పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అదనపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నామినేషన్ కేంద్రం వద్ద 24 గంటలు గార్డులు విధుల్లో ఉంటారని తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్‌కుమార్, ఏఎస్పీ రాజేశ్‌మీనా, మున్సిపల్ అధికారులున్నారు.
ప్రక్రియ సజావుగా నిర్వహించాలి
నిర్మల్‌చైన్‌గేట్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని మున్సిపల్, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని హెల్ప్‌డెస్క్ సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో రత్నకళ్యాణి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్, తహసీల్దార్ రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
సమస్యలుంటే తెలుపాలి
ఖానాపూర్: మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎలాంటి సమస్యలున్నా హెల్ప్‌లైన్‌కు లేదా తమ దృష్టికి తేవాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సూచించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని సందర్శించారు. అభ్యర్థులు, ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది ఉన్నారు.


