‘హక్కులను హరిస్తున్న కేంద్రం’
ఖానాపూర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కమిటీ పిలుపుమేరకు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం దేశవ్యాప్తంగా కార్మికులకు హక్కులు, రక్షణ లేకుండా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఆరోపించారు. విదేశీ, స్వదేశీ కార్పొరేట్లకు అనుకూలంగా, వారి ప్రయోజనాలకు అనుగుణంగా పనిచేస్తోందని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూనే దేశవ్యాప్తంగా రైతాంగంపై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఉపాధిహామీ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వీబీజీ రామ్‌జీ చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కార్పొరేట్ల ప్రయోజనం కోసం పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. జల్–జంగల్–జమీన్ విధానాన్ని అనుసరించకపోవడంతో పాటు మతపరమైన దాడులను కొనసాగిస్తోందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడడం కోసం ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా భవిష్యత్‌లో పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు రాజన్న, శంకర్, మోహన్, లక్ష్మణ్, జైతు తదితరులున్నారు.


