ఖానాపూర్‌లో రెండో సమరం!
ఖానాపూర్: పాత తాలుకాగా ఉండే నియోజకవర్గ కేంద్రమైన ఖానాపూర్ 2018 ఫిబ్రవరికి ముందు వరకు మేజర్ గ్రామపంచాయతీగా కొనసాగింది. 1958లోనే ఖానాపూర్ నగరపంచాయతీగా ఏర్పాటైంది. అప్పట్లోనే స్వర్గీయ అబ్దుల్ హమీద్ ఏకగ్రీవంగా తొలి చైర్మన్‌గా ఎన్నికై 1958 నుంచి 1961 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఖానాపూర్‌ను పంచాయతీగా మార్చారు. 1961లో స్వర్గీయ గంగాధర్‌రావు దేశ్‌పాండే తొలిసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. తదనంతరం 1963లో జరిగిన ఎన్నికల్లో జబ్బర్‌ఖాన్ సర్పంచ్‌గా ఎన్నికై 1981 వరకు 18 ఏళ్లపాటు కొనసాగారు. 1981నుంచి 1987 వరకు నర్సింహరావు జోషి, 1987 నుంచి 1994 వరకు బక్కశెట్టి రాములు సర్పంచ్‌గా ఉన్నారు. 1994 నుంచి 1997 వరకు విలాస్‌రావు దేశ్‌పాండే సర్పంచ్‌గా పనిచేసి మృతి చెందారు. తదనంతరం శికారి లక్ష్మీనారాయణ సర్పంచ్‌గా కొనసాగారు. అనంతరం 1998లో జరిగిన ఎన్నికల్లో విలాస్‌రావు సతీమణి శోభారాణి సర్పంచ్‌గా గెలిచి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మధ్యలోనే వెళ్లిపోయారు. ఆమె స్థానంలో బక్కశెట్టి లక్ష్మణ్ సర్పంచ్‌గా కొనసాగారు. 2001నుంచి జరిగిన ఎన్నికల్లో కల్వకుంట్ల రత్నకుమారి, మైలారపు గంగాధర్, ఆకుల శ్రీనివాస్, నేరెళ్ల సత్యనారాయణ వరుసగా సర్పంచులుగా ఎన్నికయ్యారు. 2019–2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు చెందిన అంకం రాజేందర్ తొలి చైర్మన్‌గా ఎన్నిక కాగా, నాలుగేళ్ల తర్వాత అతడిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గగా కాంగ్రెస్‌కు చెందిన చిన్నం సత్యం రెండో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నోటిఫికేషన్ రావడంతో ఖానాపూర్‌లో రెండోసారి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
ఖానాపూర్ పేరెలా వచ్చిందంటే..
దశాబ్దాల క్రితం జిల్లాలో కరువు ఏర్పడింది. దీంతో చాలామంది దూర ప్రాంతాల నుంచి ఖానాపూర్ ప్రాంతానికి వలస వచ్చారు. ఈ క్రమంలో ఎస్సారె స్పీ కంటే ముందే ఖానాపూర్ మండలంలోని మే డంపల్లి గ్రామం వద్ద అప్పటి గోండు రాజులు గో దావరి నదికి అడ్డంగా మాటు కట్టారు. ఆ మాటునే నేటికి సదర్‌మాట్ అని కూడా అంటారు. మాట్ నుంచి దిగువనున్న భూములకు ప్రధాన కాలువ నిర్మించి గోదావరి నుంచి మళ్లించిన సాగునీటితో ఏటా రెండు పంటలు పండించే వారు. ఆ సమయంలో ఆది ఎంతోమంది వలస కూలీలకు ఉపాధి కల్పించింది. ఆహార పంటలు అందించింది. దీంతో పని కల్పించి అన్నం పెట్టే ఊరు కావడంతో ఖానా దేనేవాలా గావ్ ‘ఖానా’పూర్‌గా రూపాంతరం చెందిందని ఈ ప్రాంతవాసులు చెబుతుంటారు.
కొత్తగా పెరిగిన ఓటర్లు
పట్టణంలో 15,604 ఓటర్లుండగా 8,020 మంది మహిళలు, 7,584 మంది పురుషులున్నారు. ఈ ఎన్నికల సందర్భంగా కొత్తగా 2,089 ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం 8,524 మంది పురుషులు, 9,169 మంది మహిళలున్నారు. మొత్తం 17,693 మంది ఓటర్లతో 12వార్డుల్లో ఈసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఖానాపూర్‌లో రెండో సమరం!


