ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలి
నిర్మల్‌చైన్‌గేట్: తెలంగాణ ఉద్యమకారుల హామీలు నెరవేర్చే వరకు ఐక్యంగా పోరాడుదామని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల సాధనకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట తెలంగాణ ఉద్యమ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీమ శ్రీనివాస్, విశిష్ట అతిథిగా మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమబోర్డు, ఉద్యమకారులను స్వాతంత్య్ర సమరయోధులుగా గుర్తించి రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డులను ఇచ్చేవరకు ఉద్యమం కొనసాగుతూనే ఉందన్నారు. ఉద్యమకారుల ఐక్యతతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఉద్యమకారుల డిమాండ్ల సహేతుకమైనవని , ఆ రోజుల్లో తెలంగాణ అంశం లేవనెత్తినందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేశానన్నారు. ఉద్యమకారుల డిమాండ్లు ముఖ్యమంత్రి వద్దకు ప్రస్తావించి డిమాండ్ల సాధనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . టీయూఎఫ్ ఉమ్మడి ఆదిలాబాద్ చైర్మన్ కొట్టే శేఖర్, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ముష్కం రామకృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షుడు డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, సీనియర్ ఉద్యమ నాయకులు పాల్గొన్నారు.


