అడవిలో అగ్గి రాజుకోకుండా..
మామడ: చలికాలం ముగిసే సమయంలో చెట్లు ఆకురాలిపోతాయి. పశువుల కాపరులు మేత కోసం అడవులకు వెళ్లి పొగ తాగడం, బాటసారులు, వ్యవసాయ భూములు చదును చేస్తూ నిప్పు వేయడంతో అడవుల్లో నిప్పు రాజుకుంటుంది. తునికి, ఇప్పపువ్వు సేకరణ కోసం కూడా అడవుల్లో మంటలు వేస్తున్నారు. ఇవి వేగంగా వ్యాపించి అడవులను దహించి వేస్తున్నాయి.
పర్యావరణ నష్టం..
జిల్లాలో 1,21,660 హెక్టార్ల అటవీ విస్తీర్ణం ఉంది. 9 అటవీ రేంజ్‌లు ఉన్నాయి. నిర్మల్ డివిజన్‌లో బైంసా, నిర్మల్, దిమ్మదుర్తి, మామడ, ఖానాపూర్ డివిజన్‌లో ఖానాపూర్, కడెం, తాండ్ర, ఉడుంపూర్, పెంబి. ఈ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు ఎక్కువ. అగ్ని ప్రమాదాలు చెట్లను మోడుగా మారుస్తున్నాయి. విలువైన అటవీ సంపద కాలి బూడిదవుతోంది. వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోయి చనిపోతున్నాయి. ఆకులు కాలిపోవడంతో నేల తేమ తగ్గి భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి. శాకాహార జంతువులకు గ్రాసం కరువవుతోంది.
ముందస్తు చర్యలు..
అడవుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు అడవి సమీప గ్రామాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంటల నష్టాలను వివరిస్తూ నిప్పు వేయడాన్ని నిరోధిస్తున్నారు. ఫైర్‌లైన్స్ ఏర్పాటు, బ్లోయర్ యంత్రాలు వాడి మంటలను అదుపులోకి తెచ్చుకుంటున్నారు. ఈ చర్యలు పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి.
అవగాహన సమావేశాలు..
ఆకురాలే సమయంలో అటవీ ప్రాంతంలో నిప్పు అంటుకునే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండి నిప్పును ఆరంభ దశలోనే బ్లోయర్ యంత్రాల ద్వారా ఆర్పేలా చర్యలు తీసుకుంటున్నాం. అడవీలో మంటల కారణంగా జరిగే నష్టాలను గ్రామస్తులకు వివరిస్తున్నాం. ముందస్తుగానే ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేయిస్తున్నాం.
– శ్రీనివాస్‌రావు, ఎఫ్‌ఆర్వో, దిమ్మదుర్తి
అడవిలో అగ్గి రాజుకోకుండా..


