మరింత పకడ్బందీగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

మరింత పకడ్బందీగా ఎఫ్‌ఆర్‌ఎస్‌

Mar 5 2026 7:40 AM | Updated on Mar 5 2026 7:40 AM

● బడికి ఆలస్యంగా వస్తే గైర్హాజరే.. ● ఉపాధ్యాయుల హాజరు నమోదులో పారదర్శకతకు విద్యాశాఖ చర్యలు

లక్ష్మణచాంద: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరు నమోదు మరింత పారదర్శకంగా ఉండేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రతీ ఉపాధ్యాయుడు రోజూ ఉదయం 9గంటల లోపు పాఠశాలకు చేరుకుని ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టం (ఎఫ్‌ఆర్‌ఎస్‌) ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 9గంటల తర్వాత నమోదు చేస్తే స్కూల్‌కు ఆలస్యంగా వచ్చినట్లు అధికారులు గుర్తిస్తారు. ఉదయం 9.15 గంటల వరకు పాఠశాల అసెంబ్లీ పూర్తి చేసి తరగతి గదులు నిర్వహిస్తారు. గతంలో 10 నిమిషాల వరకు ఆలస్యమైనా వెసులుబాటు కల్పించేవారు. ప్రస్తుతం ప్రతీ నెలలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువసార్లు ఆలస్యమైతే గైర్హాజరైనట్లు పరిగణిస్తారని పేర్కొంటున్నారు.

రోజుకు రెండుసార్ల చొప్పున..

ఉపాధ్యాయులు ప్రతిరోజూ రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరు నమోదు చేసుకోవాలి. ఉదయం 9గంటలకు మళ్లీ సాయంత్రం వెళ్లేటప్పుడు చెక్‌ అవుట్‌ హాజరు తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు ఒక పూట సెలవు పెట్టి మరో పూట పాఠశాలకు హాజరైనప్పుడు ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదుకు ప్రత్యేక నిబంధనలు పెట్టారు. ఉదయం సెలవు పెట్టి మధ్యాహ్నం పాఠశాలకు హాజరయ్యేవారు ఒంటి గంటలోపు రావాల్సి ఉంటుంది. ఉదయం పాఠశాలకు హాజరై మధ్యాహ్నం సెలవు పెట్టే ఉపాధ్యాయులు 12.30 గంటలకన్నా ముందుగా అవుట్‌ టైం నమోదు చేస్తే నిర్ణీత సమయానికి ముందుగా వెళ్లినట్లు పరిగణిస్తారు. జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 713 ఉన్నాయి. ఇందులో 3,267 మంది ఉపాధ్యాయులు ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా హాజరు నమోదు చేసుకుంటున్నారు. బుధవారం 2,535 మంది ఉపాధ్యాయులు హాజరు కాగా, 309 మంది సెలవులో ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. జిల్లాలో బుధవారం 77.59 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement