21 నుంచి వసంత పంచమి
బాసర: బాసర్ శ్రీజ్ఞాన సరస్వతీ ఆలయంలో ఈనెల 21 నుంచి మూడు రోజులు వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తామని ఈవో అంజనాదేవి తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేడుకలకు సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించామని తెలిపారు.
పటిష్టమైన ఏర్పాట్లు..
వేడుకలకు దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు వస్తారని ఈవో తెలిపారు. ఈమేరకు పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, తాగునీరు, వైద్య సేవలు, చిన్నారులకు పాలు–బిస్కెట్లు అందిస్తామన్నారు. వలంటీర్లు, విలేజ్ డెవలప్‌మెంట్ కమిటీ సభ్యుల సహకారం తీసుకుంటామని తెలిపారు. పోలీస్ భారీ బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. స్నాన ఘాట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. నిత్య అన్నదానం కొనసాగుతుందని చెప్పారు.
21న గరికపాటి రాక..
వసంత పంచమి వేడుకలు ఈనెల 21న వేకువజా మున సుప్రభాత సేవలతో ప్రారంభమవుతాయని ఈవో తెలిపారు. రెండున్నర గంటలకు మహాభిషేకం, అలంకార, పూజలు నిర్వహిస్తామన్నారు. అక్షరాభ్యాసం, కుంకుమార్చనలు. సాయంత్రం 7 గంటలు పల్లకి సేవ ఉంటాయిన తెలిపారు. గతంతో పోలిస్తే రెట్టింపు అక్షరాభ్యాస మండపాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 21న ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు హాజరవుతారని చెప్పారు. అమ్మవారి పూజల అనంతరం ప్రవచనాలు చేస్తారని పేర్కొన్నారు. సమావేశంలో ఏఈఓ సుదర్శన్‌గౌడ్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ప్రధాన అర్చకులు సంజీవ్ పూజారి పాల్గొన్నారు.


