ప్రయోగం ఇక సాఫీగా
లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రాక్టికల్స్‌కు ఆటంకాలు తొలగాయి. ప్రాక్టికల్ పరీక్షలు సమీపిస్తున్నా ల్యాబ్‌కు నిధులు మంజూరు కాకపోవడంతో అధ్యాపకుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈమేరకు ఇంటర్ బోర్డుకు నివేదికలు పంపించారు. దీంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రయోగ పరీక్షల మెటీరియల్ కోసం ఒక్కో కళాశాలకు రూ.50 వేలు మంజూరు చేసింది. గతంలో ఒక్కో కళాశాలకు రూ.25 వేలు ఇవ్వగా నేడు దానిని రూ.50 వేలకు పెంచి మంజూరు చేసింది.
జిల్లాలో ఇలా...
జిల్లా వ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో ప్రథమ సంవత్సరంలో జనరల్ విభాగంలో 2,198, ఒకేషనల్ విభాగంలో 3,94 మొత్తం 2592 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 1,856, ఒకేషనల్ విభాగంలో 396 మొత్తం 2252 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.13 కళాశాలలో ఒక్క కళాశాలకు రూ.50 వేల చొప్పున 13 కళాశాలలకు రూ.6,50,000 ప్రభుత్వం విడుదల చేసిందని ఇంటర్ అధికారులు తెలిపారు. కలెక్టర్ అనుమతి పొందిన తర్వాత ప్రయోగాల మెటీరియల్స్ కొనుగోలు చేయాల్సి ఉందని డీఐఈవో పరశురామ్ నాయక్ తెలిపారు.
నిబంధనల మేరకు కొనుగోలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రయోగశాలల మెటీరియల్స్‌ను ఇంటర్ బోర్డు సూచించిన నిబంధనల మేరకు కొనుగోలు చేయాలి. సైన్స్ అధ్యాపకులు కమిటీ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపాలి. కలెక్టర్ ఆమోదం తరువాత కొనుగోలు చేయాలి.
– పరశురామ్ నాయక్, డీఐఈవో
ప్రయోగం ఇక సాఫీగా


