కరెంటు బండి.. కొందాం పదండి
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి పెరుగుతోంది. దీంతో ఈవీ ట్రెండ్ పెరుగుతోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా ఈ–వాహనాలు ఎక్కువగా కొంటున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణ పరి రక్షణకు తోడుగా ఇంధన వ్యయాన్ని తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వాటి ధరపై 20 శాతం రాయితీ ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం ప్రోత్సాహకరంగా మారింది. 20 శాతం రాయితీ అమలులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు మరింత పుంజుకునే అవకాశముంది.
అన్నిరకాలుగా ప్రయోజనం..
ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లకు 20 శాతం సబ్సిడీతో పెట్రోల్, డీజిల్ ఖర్చులను తగ్గిస్తుంది. ‘న్యూ ఈవీ పాలసీ’ జీవో 41 ప్రకారం రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు ఇప్పటికే అమలులో ఉంది. తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణ సంరక్షణ, శబ్ద కాలుష్య నియంత్రణ ప్రయోజనాలు ఉంటాయి.
జిల్లాలో వాహనాల ధోరణి
గతంలో సైకిళ్లు ఆధారమైతే ఇప్పుడు ద్విచక్ర వాహనాలు అవసరం. నిర్మల్, బైంసా, ఖానాపూర్ డివి జన్లలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు పాపులర్ అవుతున్నాయి. 2016 నుంచి రవాణా శాఖలో 5,300 ఈ–వాహనాల రిజిస్ట్రేషన్ జరిగింది. గంటకు 25 కి.మీ. కంటే తక్కువ వేగ వాహనాలకు రిజిస్ట్రేషన్ మినహాయింపు ఉంది. రాయితీ అమలోకి వస్తే ఈ–వాహనాల కొనుగోళ్లు వేగవంతం అవుతాయి.
కాలుష్యరహితం..
గతంలో పెట్రోల్‌తో నడిచే బైక్ ఉండేది. దానిని అమ్మే సి ఎలక్ట్రిక్ చార్జింగ్ స్కూటీ ని తీసుకున్నాను. దీంతో పెట్రోల్ ఖర్చు తప్పింది. స్కూటీని తమ కుటుంబ సభ్యులందరూ కూడా సులభంగా నడుపుతున్నారు. ప్రతినెల దాదాపు రూ.3వేలకుపైగా అయ్యే ఖర్చు ప్రస్తుతం ఆదా అవుతుంది. పర్యావరణానికి హాని ఉండదు.
– జె.చంద్రశేఖర్, న్యాయవాది, నిర్మల్
ఎంతో సౌకర్యవంతం....
గతంలో పెట్రోల్ బైక్ ఉండేది. ప్రతీరోజు సగటున రూ.150 పెట్రోల్ కోసం వెచ్చించాల్సి వచ్చేది. ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేసిన తర్వాత రెండు మూడు రోజులకు ఒకసారి చార్జింగ్ పెడుతున్నాను. పెట్రోలు ఖర్చు తప్పింది. డబ్బు ఆదా అవుతుంది. పర్యావరణ పరిరక్షణలో కూడా భాగస్వామి అయ్యాను. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ఇవ్వడం శుభపరిణామం.
– ఆర్.లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్
కరెంటు బండి.. కొందాం పదండి
కరెంటు బండి.. కొందాం పదండి


