ప్రజల మెప్పు పొందాలి
అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాలి విధిగా గ్రామ సభలు నిర్వహించాలి సంక్షేమ, అభివృద్ధి పథకాలు వివరించాలి కొత్త సర్పంచులతో మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లాకేంద్రంలో ఆత్మీయ సమ్మేళనం
నిర్మల్: ఎన్నికల వరకే రాజకీయాలని, గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కొత్తగా ఎన్నికై న సర్పంచులకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు దిశానిర్దేశం చేశారు. నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు అధ్యక్షతన జిల్లాకేంద్రంలోని రెడ్డిగార్డెన్స్‌లో నిర్మల్ నియోజకవర్గ సర్పంచులకు శనివారం ఆత్మీయ సన్మానం నిర్వహించారు. మంత్రి సర్పంచులను సన్మానించి, శుభకాంక్షలు తెలి పారు. ప్రజలు ఎంతో నమ్మకంతో గెలిపించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు గ్రామంలో పర్యటించాలని, సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలన్నారు. విధిగా గ్రామసభలు నిర్వహించాలని, అభివృద్ధి ప్రణాళికల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన నిర్ణయాలు ప్రజల ముందే జరగాలని తెలిపారు.
హామీలు అమలు చేస్తున్నాం..
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ, పేదలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల గురించి సర్పంచులు ప్రజలకు వివరించాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మొత్తం 1,551స్థానాల్లో కాంగ్రెస్ 820 స్థానాల్లో గెలిచిందని, బీఆర్‌ఎస్ 343, బీజేపీ 269, స్వతంత్రులు సుమారు 110 స్థానాల్లో విజయం సాధించారని వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, మాజీ మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, వేణుగోపాలచారి, డీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీహరిరావు మాట్లాడారు. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి నిర్మల్‌లో బీజేపీ 80 సర్పంచ్ స్థానాలను గెలిచిందని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో కాంగ్రెస్సే అధిక స్థానాలు సాధించిందని, త్వరలో మరిన్ని పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ అర్జుమంద్‌అలీ, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుర్గాభవాని, పీసీసీ బాధ్యులు ఎంబడి రాజేశ్వర్, సీనియర్ నాయకులు, కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
ప్రజల మెప్పు పొందాలి


