పిల్లలు పైలం
వైద్యుల సూచనలు
నిర్మల్‌ఖిల్లా: జిల్లాలో రోజురోజుకూ చలి ప్రభావం పెరుగుతోంది. ఉదయం, సాయంత్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చల్లని వాతావరణంతో వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అధిక జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఆరోగ్య కేంద్రాల్లో రద్దీ
వైరస్‌ల కారణంగా జిల్లాలో చిన్నారులు, వృద్ధులు జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు వెళ్తున్నారు. దీంతో వారం రోజులుగా ఆస్పత్రుల్లో రద్దీ పెరిగింది. తేమ ఎక్కువగా ఉన్న వాతావరణంలో వైరల్ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. చలికి పిల్లల రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రులతోపాటు ప్రైవేట్ క్లినిక్‌లలో చిన్నారుల తాకిడి పెరిగింది.
వణికిస్తున్న చలి..
జిల్లాలో చలి వణికిస్తోంది. ముఖ్యంగా ఉదయం సగటు ఉష్ణోగ్రతలు 6 నుంచి 9 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. చల్లగాలులు వీస్తున్నాయి. దీంతో ఉదయం పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నెలంతా చలి ప్రభావం ఉంది. దీంతో పిల్లల్లో సీజనల్ ఇన్ఫెక్షన్లు విస్తరిస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
గాలి కాలుష్యం..
శీతల గాలులు తీవ్రమవుతున్న నేపథ్యంలో గాలిలో కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో చిన్నారుల్లో దగ్గు, జలుబు, గొంతు ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. 8 ఏళ్ల లోపు పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. పాఠశాలల్లో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
పాఠశాలల వేళల్లో మార్పు..
తీవ్ర చలి నేపథ్యంలో కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాల మేరకు శనివారం (డిసెంబర్ 20) నుంచి పాఠశాల పని వేళలు మారాయి. ఉదయం 9:40 నుంచి సాయంత్రం 4:30 వరకు స్కూళ్లు పనిచేస్తాయి. చిన్నారులు ఉదయ చలికి ఇబ్బంది పడకుండా ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి, వాతావరణ శాఖ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.


