గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్ రూరల్: నిరుద్యోగులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అర్జుమంద్ అలీ అన్నారు. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఇటీవల ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను శనివారం సన్మానించారు. జిల్లా గ్రంథాలయంలో చదువుకున్న 8 మంది అభ్యర్థులు గ్రూప్–2లో ఉద్యోగాలు సాధించారని తెలిపారు. వారిని శాలువాతో సత్కరించి అభినందించారు. నిరుద్యోగులు సమయం వృథా చేయకుండా కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్నారు. జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగుల కోసం అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, సదుపాయాలు కల్పించామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ జునేత్, మైనారిటీ టౌన్ ప్రెసిడెంట్ మతిన్, సమరసింహారెడ్డి, లైబ్రరీ అధికారి రాథోడ్ మోహన్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


