రోగ నిర్ధారణ ఆలస్యం
టీ–హబ్‌లో సిబ్బంది కొరత కొన్ని పరీక్షలకే పరిమితం ఏళ్లుగా భర్తీకి నోచుకోని ఖాళీలు రేడియాలజిస్టులు, పాథాలజిస్టులు, బయోకెమిస్ట్రీ వైద్యులూ లేరు.. డీఎంఈ, జిల్లా వైద్యారోగ్య శాఖల నిర్లక్ష్యం
నిర్మల్‌చైన్‌గేట్: రోగ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. దీంతో గత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో నాలుగేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నోస్టిక్స్ కేంద్రం(టీ–హబ్) ఏర్పాటు చేసింది. అన్ని ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా ఆస్పత్రికి వచ్చే రోగుల రక్త నమూనాలు ఇక్కడికి పంపించి పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేస్తున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్నా నిర్మల్ టీ–హబ్‌లో వైద్యులు, టెక్నీషియన్ల నియామకం పూర్తిస్థాయిలో జరగలేదు. దీంతో జిల్లాలో రోగ నిర్ధారణ ఆలస్యమవుతోంది. మరోవైపు లక్షల రూపాయల విలువైన యంత్రాలు, పరికరాలు నిరుపయోగంగా మూలన పడుతున్నాయి.
సీజనల్ వ్యాధులతో ఇబ్బందులు
జిల్లాలో అధిక వర్షాల కారణంగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు పెరిగాయి. ఈ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందే వారు డయాగ్నోస్టిక్ పరీక్షల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన డయాగ్నోస్టిక్ సేవలు లేక, పేద, మధ్యతరగతి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆరోగ్య మహిళ కార్యక్రమం ద్వారా మహిళల రక్త నమూనాలు సేకరించి టీ–హబ్‌కు పంపుతున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీ, యూపీహెచ్‌సీలు, ప్రభుత్వ ఆస్పత్రుల నుంచి సేకరించిన రక్త నమూనాలను టీ–హబ్‌కు పంపుతున్నారు. సిబ్బంది కొరత కారణంగా కొన్ని సందర్భాల్లో రిపోర్టులు ఆలస్యమవుతున్నాయి. ఎల్‌ఎఫ్‌టీ, కిడ్నీ, థైరాయిడ్‌కు సంబంధించిన బయోకెమిస్ట్రీ, రక్తంలోని స్థాయిలు, టైఫాయిడ్, మలేరియా, డెంగీ వంటి పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నారు.
నిలిచిన సేవలు..
టీ–హబ్‌లో రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ వైద్యులు, 12 మంది ల్యాబ్ టెక్నీషియన్లు, ఈసీజీ, 2డీ ఈకో టెక్నీషియన్లు అవసరం. అయితే, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ వైద్యులు, అల్ట్రాసౌండ్, ఈసీజీ, 2డీ ఈకో టెక్నీషియన్లు లేరు. గుండె సంబంధిత పరీక్షల కోసం టెక్నీషియన్లు, కార్డియాలజిస్ట్ వైద్యులు లేకపోవడంతో రోగులు ఈ సేవలకు దూరమవుతున్నారు. బయోకెమిస్ట్రీలో 56, పాథాలజీలో 37, మైక్రోబయాలజీలో 41 రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, 9 మంది ల్యాబ్ టెక్నీషియన్లు అవసరం. కానీ కేవలం నలుగురిని మాత్రమే నియమించారు. 15 రోజులుగా థైరాయిడ్, బీ12, డీ3 విటమిన్, పీటీఐఎన్‌ఆర్, ఏపీటీటీ, హెచ్‌పీఎల్‌సీ వంటి కీలక పరీక్షలు నిలిచిపోయాయి.
పర్యవేక్షణ లోపం..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన టీ–హబ్ కేంద్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, జిల్లా వైద్యారోగ్య శాఖల పర్యవేక్షణ లోపించడంతో ఒకరిపై ఒకరు బాధ్యతలను నెట్టివేసుకుంటున్నారు. పరీక్షలకు అవసరమైన రీఏజెంట్స్ సకాలంలో సమకూర్చడంలేదు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న తరుణంలో, జిల్లా ప్రజలకు మెరుగైన డయాగ్నోస్టిక్ సేవలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.
దిలావర్‌పూర్‌కు చెందిన మనీష గర్భిణి. సాధారణ వైద్య పరీక్షల కోసం ఇటీవల మాతాశిశు ఆస్పత్రికి వచ్చింది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు థైరాయిడ్ టెస్ట్ మాత్రం ప్రైవేటుగా చేయించుకోవాలని సూచించారు. అదేంటని అడిగితే టీ–హబ్‌లో థైరాయిడ్ టెస్ట్ చేయడం లేదని తెలిపారు. దీంతో విధిలేక ప్రైవేటు ల్యాబ్‌లో పరీక్ష చేయించుకుంది. ఈ రిపోర్టు రావడానికి మూడు రోజుల సమయం పట్టింది. టీ–హబ్‌లో టెస్టు చేస్తే సాయంత్రం లేదా మరుసటిరోజే రిపోర్టు వచ్చేదని మనీష తెలిపింది.
ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..
టీ–హబ్‌లో అవసరమైన వైద్యుల నియామకం కోసం ఉన్నతాధికారులకు నివేదించాం. ల్యాబ్ టెక్నీషియన్ల నియామకంతోపాటు, ఇతరత్రా సిబ్బంది నియామకానికి మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. సిబ్బంది కొరత ఉన్నా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షల రిపోర్టులు సకాలంలో అందేలా చూస్తున్నాం.
– డాక్టర్ గోపాల్‌సింగ్, జిల్లా జనరల్
ఆస్పత్రి సూపరింటెండెంట్
రోగ నిర్ధారణ ఆలస్యం
రోగ నిర్ధారణ ఆలస్యం


