ఉగ్ర గోదావరి
ఎగువన వర్షాలతో పెరిగిన ప్రవాహ ఉధృతి
బాసర, ఓని గ్రామాలకు నిలిచిన రాకపోకలు...
నీట మునిగిన పత్తి, సోయా పంటలు
అధికారుల అప్రమత్తత, ప్రజలకు హెచ్చరిక
బాసర: తెలంగాణలోని బాసరలో గోదావరి నది ఉగ్రరూపందాల్సింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు, వైద్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలతో తహసీల్దార్ పవన్‌చంద్ర, ఎంపీవో గంగాసింగ్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అభిమన్యు, ఏపీఓ సదానంద చారి, ఈవో ప్రసాద్ గౌడ్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు గోదావరి పుష్కర ఘాట్ల వద్ద ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. బాసర వద్ద పుష్కర ఘాట్లు నీటమునిగాయి. దీంతో నదిలో స్నానాలకు ఎవరినీ అనుమతించడం లేదు. బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రాకపోకలకు అంతరాయం..
గోదావరి ఉధృతి కారణంగా ప్రధాన రహదారిపైకి వరద రావడంతో బాసర మండలం ఓని, కౌటా, సాలాపూర్, సావర్గం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమీపంలోని సోయా, పత్తి పంటలు నీటమునిగాయి. లోతట్టు, నదీ పరీవాహక గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. విద్యుత్ స్తంభాలు, పాత ఇళ్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, పశువుల కాపరులు, చేపల వేటగాళ్లు నది ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించారు.
ఉగ్ర గోదావరి
ఉగ్ర గోదావరి
ఉగ్ర గోదావరి


