
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
లక్ష్మణచాంద: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని సందర్శించారు. వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. గ్రామాలలో జ్వరాల బారిన పడిన వారి వివరాలు, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతీ గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాజేందర్, మండల ప్రత్యేక అధికారి అంబాజీ, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గోదావరి తీర ప్రజలు
అప్రమత్తంగా ఉండాలి
మామడ: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని వదిలిన నేపథ్యంలో నది తీరగ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ సూచించారు. మండలంలోని కమల్‌కోట్ వద్ద గోదావరినది ప్రవాహానిన సోమవారం పరిశీలించారు. పశువుల కాపరులు, మత్స్యకారులు నది సమీపంలోకి వెళ్లొద్దని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాస్‌రావు, ఎంపీడీవో సుశీల్‌రెడ్డి, ఎస్సై అశోక్, డీటీ సంతోష్‌కుమార్ ఉన్నారు.