మాంత్రికుడి అరెస్ట్
ఆదిలాబాద్‌టౌన్: అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను మంత్రపూజల ద్వారా నయం చేస్తానని ఆమైపె అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఓ మహిళకు అనారోగ్య సమస్య ఉండడంతో కుటుంబ సభ్యులు ఓ వ్యక్తి సలహా మేరకు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా సార్ఖానికి చెందిన అభినయ్‌కుమార్‌ను పిలిపించారు. అభినయ్‌కుమార్ గురువారం రాత్రి పూజల పేరిట మహిళను గదిలోకి తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు మహిళ కేకలు వేయగా కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వన్‌టౌన్ పోలీసులు అభినయ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాధిత మహిళకు అవసరమైన వైద్య, మానసిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. వన్‌టౌన్ సీఐ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.


