గుండేగాం కష్టం తీరేదెప్పుడో!
● ప్రతీ వానాకాలంలో తప్పని ముంపు ● ఇటీవలి అకాల వర్షాలకు ఆందోళన ● పునరావాసం కోసం గ్రామస్తుల నిరీక్షణ
భైంసా/భైంసారూరల్: వారం రోజులుగా కురుస్తు న్న వర్షాలతో గుండేగాం వాసుల్లో మళ్లీ భయం ప ట్టుకుంది. భారీ వర్షాలు కురిస్తే ఈసారి కూడా నీట మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. గుండేగాం పునరావాసంపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావడంలేదు. ముధోల్ ఎమ్మెల్యే రామారావుపటేల్ అసెంబ్లీలో పునరావాసం విషయం ప్రస్తావించారు. ఇటీవలే కుంటాలలో నిర్వహించిన భూభారతి రెండో విడత కార్యక్రమానికి హాజరైన రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సమక్షంలో గుండేగాం పునరావాస విషయం చర్చకు వచ్చింది. ము ధోల్ ఎమ్మెల్యేతోపాటు మాజీ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, సముద్రాల వేణుగోపాలాచారి పునరావాసం కల్పించాలని మంత్రులను కోరారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చారు.
గతంలోనే సర్వే పూర్తయినా..
గత ప్రభుత్వ హయాంలో అధికారులు సర్వే పూర్తి చేశారు. రూ.200 కోట్లకుపైగా నిధులు అవసరమని ప్రతిపాదించారు. భైంసా మండలం సిద్దూర్ శివా రులో సర్వేనంబర్ 73లో మూడెకరాలు గుర్తించి పు నరావాసం కల్పిస్తామని చెప్పారు. ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించిన నమూనాలు పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలో పునరావా సానికి రూ.66 కోట్లు అవసరమని మరో ప్రతిపాదన పంపించారు. ఈ నిధులు సరిపోవంటూ మరో రూ.33 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదించా రు. ఇలా పలుసార్లు ఇచ్చిన నివేదికలన్నీ ప్రభుత్వం వద్దే మగ్గుతున్నాయి. మరోవైపు గుండేగాంవాసులు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చు ట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా.. ముంపు స మస్యకు పాలకులు పరిష్కారం చూపడంలేదు.
రెండేళ్లుగా పునరావాస కేంద్రంలోనే..
రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలతో గ్రామస్తులు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలోనే ఇప్పటికీ గుండేగాం వాసులు ఉంటున్నారు. కమలాపూర్ గుట్ట సమీపంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలలోనే కాలం వెల్లదీస్తున్నారు. ప్రతీరోజు అక్కడి పంట పొలాల్లో పని చేసుకుని సాయంత్రానికి ఇక్కడికే తిరిగివస్తున్నారు. ఇంకొంత మంది ఊరిలోనే ఉంటున్నారు. రోజూ రాకపోకలు కష్టమని వానాకాలంలో నీరొస్తే ఊరు నుంచి బయటికి వెళ్తారు. తగ్గగానే మళ్లీ గుండేగాంకు చేరుకుని ఇబ్బందుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు.
గ్రామం : గుండేగాం
కుటుంబాలు : 270
ఆయకట్టు : 364 ఎకరాలు
ప్రధాన సమస్య : పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ ఊరిలోకి రావడం, ఏటా గుండేగాం నీటమునగడం.
పరిష్కారం : భైంసా సమీపంలోని కమలాపూర్ గుట్టవద్ద పునరావాస గ్రామం ఏర్పాటు చేయడం.
ప్రాజెక్ట్ నిర్మాణంతోనే..
పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ నిర్మాణంతో ప్రతీ వానాకాలంలో గుండేగాం గ్రామం పూర్తిగా నీటమునుగుతోంది. ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఊరు మునగదని గ్రామస్తులకు తేల్చిచెప్పారు. కట్ట నిర్మాణం పూర్తయితే వానాకాలంలో కచ్చితంగా నీరు వస్తుందని గుండేగాం గ్రామస్తులు చెప్పినా అధికారులు, పాలకులు పట్టించుకోలేదు. గతేడాది భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్ గుండేగాంను నీటముంచింది. వాగు పరీవాహక ప్రాంతాల్లో నివాసముంటున్నవారు కట్టుబట్టలతో బయటకువచ్చారు.
సమస్య పరిష్కరిస్తాం
గుండేగాం గ్రామంలో మళ్లీ ఇబ్బందులు తలెత్తకుండా చూస్తాం. ఇప్పటికే అసెంబ్లీలో సమస్యను ప్రస్తావించాను. అధికారులతోనూ సమీక్ష నిర్వహించాం. ఈ వానాకాలంలో గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే ఈ సమస్య తలెత్తింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం ఇచ్చాం.
– పవార్ రామారావుపటేల్, ముధోల్ ఎమ్మెల్యే


