● బాసర గర్భాలయం పనులకు శ్రీకారం ● రూ.22 కోట్లతో నిర్మాణం ● భూమిపూజ చేసిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ● త్వరలోనే బాలాలయం ఏర్పాటు

- - Sakshi

బాలాలయంపై కసరత్తు..

బాసర అమ్మవారి ప్రధానాలయం పునర్నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ నిర్మాణ పనులు చేపట్టే సమయంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా రూ.150 టిక్కెట్‌ అక్షర శ్రీకార మండపాన్ని బాలాలయంగా ఏర్పాటు చేయాలని ఆలయ కమిటీ భావిస్తోంది. విశాలమైన ఈ మండపంలో ప్రధానాలయం గర్భగుడి పనులు పూర్తయ్యేవరకు సరస్వతీ అమ్మవారి దర్శనాలు, అక్షరాభ్యాస పూజలు ఇక్కడే జరిగేలా ఆలోచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించారు. అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తారు. ఆలోపే బాసర వచ్చే భక్తులు, అక్షరాభ్యాసాలు జరిగేందుకు వీలుగా ఈ మండపాన్ని మార్చాలని భావిస్తున్నారు.

భైంసా: బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయం త్వరలో సరికొత్తగా నిర్మాణం కానుంది. ఈమేరకు ఆల య పునర్నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, ముధోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి భూమిపూజ చేశారు. బాసర ఆలయ అర్చక బృందం, ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సరస్వతీ గర్భాలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బాసర ఆలయాన్ని పూర్తిస్థాయిలో మార్చేందుకుగాను సీఎం కేసీఆర్‌ రూ.50 కోట్లు మంజూరు చేశారు. ఇప్పటికే రూ.8 కోట్ల వ్యయంతో ఆలయ ప్రాంగణంలోని విశ్రాంతి భవనాల ఆధునీకరణ, ఇతర పనులు చేపట్టారు. తాజాగా మరో రూ.22 కోట్లతో గర్భాలయ పునర్ని ర్మాణ పనులు చేపట్టనున్నారు. కృష్ణశిలలతో అత్యద్భుతంగా గర్భాలయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆలయ ఈవో విజయరామారావు దేవాదాయ శాఖ ముందు గర్భగుడి నమూనాలు ఉంచి మార్పులు చేర్పులపై వారి సలహాలు సూచనలతో పనులు చేపట్టనున్నారు.

టెండర్లు పిలవగానే..

బాసర గర్భగుడి పనులు ప్రారంభానికి భూమిపూజ పూర్తయింది. టెండర్లు పిలిచిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. నెలరోజులుగా బాసర ఆలయంపై సమీక్షలు, సమావేశాలు, నూతన నమూనాలు, మాస్టర్‌ప్లాన్‌, ఇలా అన్నింటిపై కసరత్తు పూర్తి చేశారు. ఎన్నికలకు ముందుగానే ఆలయ పనులు ప్రారంభించాలని చూస్తున్నారు. ఇటీవలే బాసర వచ్చిన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ అమలు విషయమై ఆలయ అధికారులతో చర్చించారు. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి సూచనలతో రూపుదిద్దుకున్న నూతన నిర్మాణ నమూనాను మరోమారు పరిశీలించారు. గర్భగుడి ప్రధానాలయం నిర్మాణ సమయంలో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోబోయే చర్యలు, ప్రత్యామ్నాయ విషయాలపై చర్చించారు.

కృష్ణ శిలలతో నిర్మాణం...

దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శృంగేరి పీఠాధిపతి విదుశేఖర భారతి మార్గదర్శనంతో ప్రధానాలయం గర్భగుడిలో మార్పులు చేర్పులు జరుగనున్నాయి. ప్రస్తుతం సరస్వతీ అమ్మవారి దర్శనం అనంతరం పక్కనే ఉన్న మహాలక్ష్మి అమ్మవారి ప్రతిమ కనిపించదు. రానున్న రోజుల్లో మహాలక్ష్మి అమ్మవారు కనిపించేలా ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నారు. మహంకాళి అమ్మవారి ప్రతిమ వెనుక ప్రాకారం మండపం, ప్రాకారం లోపల శివాలయ పునః ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామివారి స్థల మార్పిడి, నలుదిక్కులా రాజగోపురాలు నిర్మాణం, అనివేటి మండప విస్తరణ, ధ్వజ స్తంభం ఏర్పాటు, ఆలయ ప్రాంగణంలోనే యాగశాల ఏర్పాటు వంటివి చేపట్టనున్నారు.

Read latest Nirmal News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top