‘ఉపాధి’కి ప్రయోజనం
నిర్మల్‌చైన్‌గేట్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. వీటిపై కూలీలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం వీబీజీ రాంజీ (వికసిత భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్)గా మార్చడంతో పాటు ఇటీవల చట్టంగా అమలులోకి తెచ్చింది. దీనిపై అవగాహన కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి పథకం ద్వారా చేపట్టే ప నులను ప్రజలకు వివరించనున్నారు. వారం వ్యవధిలోనే గ్రామసభలు పూర్తి చేసి పథకం పకడ్బందీగా అమలయ్యేందుకు చర్యలు తీసుకోనున్నారు.
125 రోజులకు పెంపు..
గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు ఏడాదికి 100 రోజుల వరకు పని కల్పించేందుకు గ్యారంటీ ఉండగా ఇప్పుడు కేంద్రం ఈ పరిమితిని 125 రోజులకు పెంచింది. గతంలో ఇందుకు అయ్యే ఖర్చును కేంద్రమే భరించింది. ఇక నుంచి కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం ఖర్చు భరించాల్సి ఉంది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న కూలీలకు 15 రోజుల్లోగా పని లభించకపోతే రోజూవారీ నిరుద్యోగభృతి చెల్లించేందుకు వీలు కల్పించారు. జిల్లాలోని 400 గ్రామ పంచాయతీల్లో ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... మొత్తం 3.38 లక్షల మంది కూలీలుగా నమోదై ఉన్నారు. వీరిలో యాక్టివ్ కూలీలు 2.28 లక్షల వరకు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు.
పథకంలో కీలక మార్పులు..
ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వం మట్టి పనులను పూర్తిగా తొలగించింది. గతంలో ఎక్కువగా చెరువుల్లో పూడికతీత, కందకాల తవ్వకం వంటి పనులను చేపట్టేవారు. అయితే వీటిలో ఆశించినంత పని జరగలేదన్న అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మారిన నిబంధనల మేరకు ఇకపై జలసంరక్షణ పనులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వనున్నారు. చెరువులు, కుంటల స్థిరీకరణ, భూగర్భ జలాలు పెంచే వాటర్ షెడ్లు, కాల్వల నిర్మాణం, నీటిబావుల తవ్వకం వంటి పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో చేపట్టిన పంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలు ఇకపై కొనసాగించనున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగే కాలంలో సుమారు 2 నెలల పాటు పథకం పనులను నిలిపివేయనున్నారు. వ్యవసాయ రంగంలో రైతులకు కూలీల కొరత తలెత్తకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టనున్నారు.
ప్రతీ పనికి జియోట్యాగింగ్..
గ్రామసభలను నిర్వహించడంతో పాటు పనులకు సంబంధించిన ఫొటోలను జియోట్యాగింగ్ చేసి ఉపాధి హామీ పోర్టర్‌లో అప్‌లోడ్ చేయనున్నారు. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి.
జిల్లా వివరాలు
మండలాలు : 18
గ్రామ పంచాయతీలు : 400
జాబ్ కార్డులు : 1.77 లక్షలు
కూలీల సంఖ్య : 3.33 లక్షలు
యాక్టివ్ జాబ్ కార్డులు : 1.30 లక్షలు
యాక్టివ్ కూలీల సంఖ్య : 2.28 లక్షలు
జలసంరక్షణకు ప్రాధాన్యం..
ఇకపై చేపట్టే పనుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని నీటి వనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తాగు, సాగునీటి వనరులను మెరుగుపర్చుకునేందుకు పనులు చేపట్టనున్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, నీటివసతి, ప్రజల జీవనాన్ని మెరుగుపర్చే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మంచినీటి రౖపైడ్లెన్లు, సాగునీటి కాల్వలు, పొలాల్లో పిల్లకాల్వల తవ్వకాలు చేపట్టేందుకు వీలుకలుగనుంది.
ఉపాధి హామీ పనిస్థలంలో కూలీలు (ఫైల్)


