యువత ఉద్యోగాలు హుష్‌ కాకి | Youth Lost Jobs In Corona Period In India | Sakshi
Sakshi News home page

యువత ఉద్యోగాలు హుష్‌ కాకి

Jan 20 2021 8:08 PM | Updated on Jan 20 2021 8:08 PM

Youth Lost Jobs In Corona Period In India - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించినంత వరకు యువత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గత మూడేళ్లుగా ఆర్థిక వ్యవస్థ మందగమనంతో ఇబ్బందులు పడుతున్న యువతను, కరోనా పరిస్థితుల్లో విధించిన సుదీర్ఘ లాక్‌డౌన్‌ మరింత దెబ్బకొట్టింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని యువ ఉద్యోగులు, కార్మికులు ఎక్కువగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోయినట్టు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక పేర్కొంది. తమ కన్జూమర్‌ పిరమిడ్‌హోస్‌హోల్డ్‌ సర్వే (ఇంటింటి సర్వే) ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా సీఎంఐఈ ఈ నివేదిక రూపొందించింది. ప్రస్తుత పరిస్థితుల్లో 40 ఏళ్లలోపు వారే అధికస్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో దేశీయ వర్క్‌ఫోర్స్‌ (మొత్తం పనిచేసే వారిలో)లో 40 ఏళ్లలోపు వారి సంఖ్య తగ్గిపోతోందని, అదే సమయంలో 40 ఏళ్లు పైబడినవారి సంఖ్య పెరుగుతున్నట్టు తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఇదేమంత మంచి పరిణామం కాదని పేర్కొంది. తమ తమ రంగాల్లో మెరుగైన నైపుణ్యాలు కలిగిన గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు కోల్పోవడం వల్ల ఆ ప్రభావం వివిధ అంశాలపై పరోక్షంగా పడుతుందని హెచ్చరించింది.

వేతన జీవులే అధికం 
2020 డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారిలో 40 ఏళ్లకు పైబడిన వారు 60 శాతంగా ఉన్నారు. ఇది గతేడాదితో పోల్చితే 4 శాతం అధికం. అదే సమయంలో వయసు తక్కువ ఉన్న ఉద్యోగుల (40 ఏళ్ల లోపు వారు) వాటా గణనీయంగా తగ్గింది. మొత్తంగా చూస్తే గత కొన్నినెలల నుంచి 2020 డిసెంబర్‌ నాటికి వివిధ రంగాలు, విభాగాల్లో దాదాపు కోటిన్నర ఉద్యోగాలు పోగా, వాటిలో 95 లక్షల వరకు గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువతే ఉన్నారు. 2019–20లో నెలవారీ వేతనాలు, జీతాలు వచ్చే ఉద్యోగులు 21 శాతంగా ఉండగా, 2020 డిసెంబర్‌ నాటికి మొత్తం ఉద్యోగాలు పోయిన వారిలో 71 శాతం వారే ఉండటం గమనార్హం.
 
ఏయే రంగాలపై ప్రభావం 
ప్రధానంగా వ్యవసాయేతర రంగాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినట్టు సీఎంఐఈ పేర్కొంది. 2017 నుంచి 2020 మార్చి వరకు సేవల రంగంలో ఉద్యోగ అవకాశాలు కొంత పెరిగినా.. లాక్‌డౌన్‌తో ఈ రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. అన్‌లాక్‌తో ఆ తర్వాత పాక్షికంగా కోలుకున్నా గతేడాది మార్చి నెల స్థాయికి మాత్రం ఇంకా చేరుకోలేదు. అలాగే రిటైల్‌ వ్యాపార రంగం, రవాణా, పర్యాటక రంగాలపై కూడా అధిక ప్రభావం పడింది. రిటైల్‌ రంగంలో ఎక్కువగా ఉద్యోగాలు పోగా, ఆ తర్వాతి స్థానాల్లో రవాణా, పర్యాటక, విద్య, తదితర రంగాలు నిలిచాయి. విద్య, దాని అనుబంధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు భారీగా తగ్గిపోయాయి. తయారీ రంగం కూడా పూర్తిస్థాయిలో పుంజుకోలేకపోయింది. ఉద్యోగాల కల్పనలో సేవల రంగంతో పాటు రియల్‌ ఎస్టేట్, భవన నిర్మాణ రంగం కొంతమేర మెరుగైన స్థితికి చేరుకున్నాయి.

పరిమిత సంఖ్యలోనే అవకాశాలు 
లాక్‌డౌన్‌తో సేవల రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. అన్‌లాక్‌ తర్వాత వ్యవసాయం, గృహ నిర్మాణం, తయారీ రంగంలో అవకాశాలు కొంత పెరిగినా ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదు. 2019–20తో పోల్చితే 2020 డిసెంబర్‌ వరకు ఫార్మాస్యూటికల్స్‌ మినహా పెద్ద పెద్ద పరిశ్రమలు పరిమిత సంఖ్యలోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. – మహేశ్‌ వ్యాస్, సీఈవో, సీఎంఐఈ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement