
2000లో ధూమపాన ప్రియుల సంఖ్య 138 కోట్లు
2024లో 120 కోట్లకు తగ్గిన వినియోగదారులు
గణనీయంగా పెరిగిన ఈ–సిగరెట్స్ వాడకం
ముఖ్యంగా మైనర్లకూ వ్యసనంగా మారిన వైనం
ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
ప్రపంచవ్యాప్తంగా ధూమపానం తగ్గింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ధూమపానం చేసేవారి సంఖ్య 2000 సంవత్సరంలో 138 కోట్లు. 2024 వచ్చేసరికిఈ సంఖ్య 120 కోట్లకు పడిపోయింది. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు పైబడినవారిలో ప్రతి ఐదుగురులో ఒకరు పొగతాగుతున్నారు.నివారించగల ముప్పు అయినప్పటికీ ధూమపానం ఏటా కోట్లాది మంది ప్రాణాలు తీస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.
అంతర్జాతీయంగా 2000–2024 మధ్య.. 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న జనాభాలో ధూమపానం చేసేవారు, అలాగే 2030 నాటికి దీని వినియోగం ఎలా ఉండబోతోంది అన్న అంచనాతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నివేదిక రూపొందించింది. మొదటిసారిగా డబ్ల్యూహెచ్‌ఓ ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్ వినియోగాన్ని అంచనా వేసింది. ఈ గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
ముప్పుగా ఈ–సిగరెట్స్
ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల మందికిపైగా ప్రజలు వేపింగ్ చేస్తున్నారు. ఈ–సిగరెట్స్, వేప్ పెన్స్, మోడ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఏరోసోల్ (ఆవిరి) పీల్చడాన్ని వేపింగ్ అంటారు. వేపింగ్ ప్రక్రియలో పొగాకుకు బదులు నికోటిన్, ఫ్లేవర్లు, ఇతర రసాయనాలు కలిగి ఉన్న ద్రవం (ఈ–లిక్విడ్) వాడతారు. క్యాన్సర్ కారకాలతో సహా హానికర రసాయనాలు ఏరోసోల్‌లో ఉంటాయి.
వేపింగ్‌తో శ్వాస సమస్యలు, అవయవ నష్టం వంటి తీవ్రమైన అనారోగ్యాలు కలుగుతాయి. భారత్‌లో ఈ–సిగరెట్ తయారీ, వాడకం నిషేధం. నికోటిన్ వ్యసనంగా మారడానికి ఈ–సిగరెట్లు కారణమని డబ్ల్యూహెచ్‌ఓ చెబుతోంది. పిల్లలు నికోటిన్ కు బానిసలవుతున్నారని, ఇవి దశాబ్దాల పురోగతిని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
మహిళలే ముందంజలో..
2000–24 మధ్యకాలంలో అన్ని వయసుల వారిలో ధూమపానంలో స్థిరమైన తగ్గుదల ఉన్నప్పటికీ.. పురుషులతో పోలిస్తే మహిళలు ముందంజలో ఉన్నారు. 2025 సంవత్సరానికిగాను నిర్దేశించుకున్న ప్రపంచ తగ్గింపు లక్ష్యాన్ని ఐదేళ్లకు ముందే మహిళలు చేరుకున్నారని నివేదిక తెలిపింది. పురుషులు ఈ లక్ష్యాన్ని 2031 వరకు చేరుకోలేరని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా.
మహిళల్లో ధూమపానం వ్యాప్తి 2010లో 11% నుంచి 2024లో 6.6%కి తగ్గింది. పొగతాగే మహిళల సంఖ్య 2010లో 27.7 కోట్లు ఉండగా.. 2024లో 20.6 కోట్లకు తగ్గిపోవడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా పొగతాగేవారిలో ప్రతి ఐదుగురిలో నలుగురికి పైగా పురుషులే. మగవారిలో ధూమపానం చేసేవారి సంఖ్య 2010లో 41.4% నుంచి 2024లో 32.5%కి తగ్గినప్పటికీ మార్పు వేగం చాలా నెమ్మదిగా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ వివరించింది.
భారత్‌లో ఇలా..
15 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో పొగ తాగుతున్నవారు 24.35 కోట్లు
పురుషులు 19.4కోట్లు
స్త్రీలు 4.93కోట్లు
2025లో ప్రపంచ జనాభాలో ధూమపానం వ్యాప్తి అంచనా 21.9%
2000లో వ్యాప్తి అంచనా 49.8%
2030 నాటికి పొగ తాగేవారి వ్యాప్తి అంచనా 18.8%
ప్రపంచవ్యాప్తంగా ఈ–సిగరెట్స్ వాడుతున్నవారు 10 కోట్లు
13–15 ఏళ్ల వయసున్న ఈ–సిగరెట్ వినియోగదారులు 1.5 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా 15 ఏళ్లు ఆపై వయసువారిలో పొగ తాగుతున్నవారు..
సంవత్సరం స్త్రీలు పురుషులు
2010 11% 41.4%
2024 6.6% 32.5%
ప్రాంతాలవారీగా ధూమపాన ప్రియుల శాతం
యూరప్ 24.1
ఆగ్నేయాసియా 23.4
పశ్చిమ పసిఫిక్ దేశాలు 22.9
అమెరికా 14
ఆఫ్రికా 9.5