
వాటి ఉత్పత్తిని ఆపివేయాలని ఆదేశించాం
అవేవీ విదేశాలకు ఎగుమతి కాలేదు
ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలిపిన సీడీఎస్‌సీవో
న్యూఢిల్లీ/చెన్నై/ఛింద్వారా: దేశంలో తయారైన కోల్డ్రిప్, రెస్పిఫ్రెష్‌టీఆర్, రిలైఫ్ అనే దగ్గు సిరప్‌లను మార్కెట్ నుంచి ఉపసంహరించినట్లు సెంట్రల్ డ్రగ్ స్టాండర్ట్ కంట్రోల్ ఆర్గనైజేషన్(సీడీఎస్‌సీవో) తెలిపింది. అదేవిధంగా, ఈ సిరప్‌ల ఉత్పత్తిని నిలిపివేయాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఉపసంహరించుకున్న దగ్గు సిరప్‌లలో ఏ ఒక్కటి కూడా విదేశాలకు ఎగుమతి కాలేదని కూడా స్పష్టం చేసింది.
భారత్‌లో దగ్గు సిరప్ వాడకంతో కిడ్నీలు ఫెయిలై, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రమాదకరమైన ఈ ఔషధాలను ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయా తెలపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీడీఎస్‌సీవో స్పందించి డబ్ల్యూహెచ్‌వోకు ఇచ్చిన సమాధానంలో పై విషయాలున్నాయి. ఈ దగ్గు సిరప్‌లలో ఇథలీన్ గ్లైకాల్, లేదా డై ఇథలీన్ గ్లైకాల్ మరేదైనా కల్తీ జరిగినట్లు గుర్తించారా అనే విషయం తమకు తెలియజేయాలని కూడా డబ్ల్యూహెచ్‌వో కోరింది.
ఇలాంటివి గుర్తిస్తే వాటి సరఫరా విక్రయాలను వెంటనే నిలిపివేయాలని కూడా కోరింది. మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు సిరప్ తాగి 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన నేపథ్యంలో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల డ్రగ్ కంట్రోలర్లను అప్రమత్తం చేసింది. ఔషధ తయారీ యూనిట్లను తనిఖీ చేసి, సరైన ముడిపదార్థాలను వాడుతున్నారా లేదా గమనించాకే వాటిని మార్కెట్‌లోకి విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఫార్మా కంపెనీ యజమాని అరెస్ట్
మధ్యప్రదేశ్‌లో పలువురు చిన్నారుల మరణాలకు కారణమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్‌ను తయారు చేసే చెన్నైలోని శ్రేసన్ ఫార్మా కంపెనీ యజమాని రంగనాథన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పించుకు తిరుగుతున్న అతడిని మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన సిట్ అధికారుల బృందం, తమిళనాడు పోలీసుల సాయంతో బుధవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకుంది.
22కు చేరిన చిన్నారుల మరణాలు
మధ్యప్రదేశ్‌లో కల్తీ దగ్గు మందు తాగి, కిడ్నీలు ఫెయిలై చనిపోయిన చిన్నారుల సంఖ్య గురువారానికి 22కు చేరుకుంది. ఛింద్వారాకు పొరుగునున్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఐదేళ్ల విశాల్, నాలుగేళ్ల మయాంక్ సూర్యవంశీ బుధవారం రాత్రి చనిపోయారని అధికారులు తెలిపారు.