వారిలో 50% మందికి వర్క్‌ ఫ్రం హోమ్‌

Work from home, biometrics attendance closed for 50percent  - Sakshi

బయోమెట్రిక్‌ హాజరు నిలిపివేత

తక్షణం అమల్లోకి: కేంద్రం ఆదేశాలు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అండర్‌ సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50% మందికి వర్క్‌ ఫ్రం హోమ్‌కు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని సోమ వారం తెలిపింది. వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50% మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరుకావాలని, మిగతా సగం మందికి వర్క్‌ఫ్రం హోమ్‌ను అమలు చేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది.

అదేవిధంగా, కంటెయిన్‌మెంట్‌ జోన్లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీ నోటిఫై చేసే వరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులంతా ఒకే సమయం లో కార్యాయాలకు రాకుండా వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు.   ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అంతా హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top