
గౌహతి: దేశంలో ఇటీవలి కాలంలో భర్తలను అంతమొందిస్తున్న భార్యలకు సంబంధించిన ఉదంతాలు విరివిగా వినిపిస్తున్నాయి. తాజాగా అసోంలోని గౌహతిలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. దంపతుల మధ్య జరిగిన చిన్నపాటి గొడవ చివరకు భర్త హత్యకు దారితీసింది.
గౌహతి పోలీసులు భర్తను హత్యచేసిన భార్యను అదుపులోకి తీసుకున్న దరిమిలా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. నిందితురాలు రహిమా ఖాతున్(38), ఆమె భర్త సబియాల్ రెహమాన్ (40)తో తరచూ గొడవ పడేదని పోలీసులు తెలిపారు. సబియాల్ రెహమాన్ స్క్రాప్ డీలర్‌గా పనిచేస్తున్నాడు. జూన్ 26న అతను తన పని ముగించుకుని, పాండు ప్రాంతంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చాడు.
పోలీసులు ప్రాథమిక దర్యాప్తులోని వివరాల ప్రకారం.. ఆ సమయంలో తన భర్త మద్యం మత్తులో ఉన్నాడని, ఆ సమయంలో తలెత్తిన ఇంటి గొడవ దాడులకు దిగేవరకూ కొనసాగిందని రహీమా చెప్పింది. ఈ నేపధ్యంలోనే భర్త హతమయ్యాడని పేర్కొంది. కాగా భర్త మృతదేహాన్ని ఆమె ఇంటి ఆవరణలో ఐదు అడుగుల లోతున గొయ్యి తవ్వి, దానిలో పూడ్చిపెట్టిందని సమాచారం. ఆ జంటకు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా రెహమాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో పొరుగింటివారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో నిందితురాలు తొలుత తన భర్త పని కోసం కేరళకు వెళ్లాడని తెలిపింది. తరువాత మాటమార్చి, అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నాడని తెలిపింది. రెహమాన్ సోదరుడు జూలై 12న జలుక్‌బరి పోలీస్ స్టేషన్‌లో ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. మర్నాడు పోలీసులు రహిమా ఖాతున్‌ను విచారించగా తమ దంపతుల గొడవల్లో భర్త మరణించాడని చెప్పింది. ఆ తర్వాత తాను భర్త మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టానని పోలీసులకు చెప్పింది.
ఫోరెన్సిక్ నిపుణులు, మేజిస్ట్రేట్‌తో కూడిన పోలీసు బృందం వారి ఇంటి ఆవరణలోని గొయ్యిలో నుంచి కుళ్లిపోయిన మృతదేహ అవశేషాలను వెలికి తీసింది. రహీమా ఒక్కర్తే ఈ హత్య చేసి ఉండకపోవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఒక మహిళ స్వయంగా ఇంత పెద్ద గొయ్యిని తవ్వే అవకాశం లేదని, ఇతరుల ప్రమేయం ఉండవచ్చని, ఈ దిశగా దర్యాప్తు జరుగుతున్నదని పోలీసులు తెలిపారు.