అన్నామ‌లై.. మ‌రో టాలెంట్‌ | When Annamalai took over the big screen with his Kannada debut | Sakshi
Sakshi News home page

Annamalai: క‌న్న‌డ సినిమాలో త‌మిళ నేత‌

Jun 6 2026 6:44 PM | Updated on Jun 6 2026 7:53 PM

When Annamalai took over the big screen with his Kannada debut

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామ‌లై స‌రికొత్త రాజ‌కీయయాత్ర‌ అరంభించారు. మారుదాం.. మార్చుదాం ఉద్య‌మ‌ నినాదంతో ఇక‌పై కొత్త ప‌థంలో ముందుకు సాగుతాన‌ని ఆయ‌న శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. త‌న‌తో పాటు క‌లిసి ప్ర‌యాణించేందుకు రావాల‌ని త‌మిళ ప్ర‌జ‌ల‌ను ఆహ్వ‌నించారు. ఇందుకోసం విత్ ద లీడ‌ర్ పేరుతో వైబ్‌సైట్ కూడా ప్రారంభించారు. ఇదిలావుంచితే అన్నామ‌లైకు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది.

రాజకీయాల్లోకి రాకముందు అన్నామ‌లై ఒక కన్నడ సినిమాలో నటించిన సంగ‌తి వెల్ల‌డైంది. కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన రోజుల్లో "కర్ణాటక సింగం"గా గుర్తింపు పొందిన ఆయ‌న వెండి తెర‌పైనా సంద‌డి చేశారు. స్ఫూర్తిదాయ‌క క్రీడా శిక్ష‌కుడి పాత్ర‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అన్నామ‌లై స‌రికొత్త‌గా రాజ‌కీయ ప్ర‌స్థానం మొద‌లుపెట్టిన నేప‌థ్యంలో ఈ విష‌యం మ‌రోసారి సోష‌ల్ మీడియాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రూ.1కే నటించిన అన్నామలై
భారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవితం ఆధారంగా తెర‌కెక్కిన క‌న్న‌డ సినిమా ‘అరబ్బీ’లో అన్నామ‌లై స్విమ్మింగ్ కోచ్ పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం ఆయన కేవలం ఒక రూపాయి మాత్రమే పారితోషికం తీసుకోవ‌డం విశేషం. ఈ సినిమా దర్శకుడు రాజ్‌కుమార్.. మంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అనామలైను క‌లిసిన‌ప్పుడు ఈ పాత్ర గురించి చెప్పారు. క‌థ న‌చ్చ‌డంతో ఆయ‌న తొలిసారిగా కెమెరా ముందుకు వ‌చ్చారు.

ఒకటిన్నర రోజులో షూటింగ్ 
ఒక పాటతో పాటు అన్నామ‌లైకు సంబంధించిన అన్ని సన్నివేశాలను కేవలం ఒకటిన్నర రోజులో చిత్రీక‌రించారు. మొట్ట మొద‌టిసారి కెమెరా ముందుకు వ‌చ్చినా చిత్రబృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ పూర్తి చేశారాయ‌న‌. అనువ‌జ్ఞులైన న‌టుల‌కు ఏమాత్రం తీసిపోకుండా ఆయ‌న వెండితెర‌పై న‌ట‌న క‌న‌బ‌రిచి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశారు. స్విమ్మింగ్ కోచ్ పాత్ర‌లో చ‌క్క‌గా ఇమిడిపోయారు. సినిమాలోని ఆయ‌న పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్రజలకు స్ఫూర్తినిచ్చే కథను విస్తృతంగా చేరవేయాలనే ఉద్దేశంతోనే ‘అరబ్బీ’ సినిమాలో నటించారని అన్నామ‌లై సన్నిహితులు పేర్కొన్నారు. మొదటి నుంచి ఆయ‌నకు సామాజిక అంశాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉంద‌ని గుర్తు చేసుకుంటున్నారు.

స్ఫూర్తి గాథ‌
భారత పారా స్విమ్మింగ్ ఛాంపియన్ విశ్వాస్ కేఎస్ జీవిత‌క‌థ ఆధారంగా ‘అరబ్బీ’ సినిమా తీశారు. ఇందులో విశ్వాస్ తన పాత్రను తానే పోషించ‌డం విశేషం. విద్యుత్ ప్రమాదంలో రెండు చేతులతో పాటు తండ్రిని కోల్పోయిన ఆయ‌న‌ ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని పారా స్విమ్మర్‌గా ఎదిగారు. 2016లో అంతర్జాతీయ స్థాయికి చేరుకుని, భారత్ తరఫున కాన్-యామ్ పారా-స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు రజతాలు, ఒక కాంస్య పతకం సాధించారు. కుంగ్‌ఫూ, నృత్యంలోనూ ఆయ‌న ప్ర‌వేశం ఉంది. ‘అరబ్బీ’ చిత్రం కేవలం బయోపిక్ కాదని, తన జీవిత ప్రయాణాన్ని నిజాయితీగా ఆవిష్కరించిన కథ అని విశ్వాస్‌ పేర్కొన్నారు. త‌న‌లా కష్టాలను ఎదుర్కొంటున్న వారికి ఈ సినిమా స్ఫూర్తినిస్తుందని విశ్వాసం వ్య‌క్తం చేశారు. 

 చ‌ద‌వండి: ప్ర‌జావేదిక ప్రారంభించిన ర‌జ‌నీకాంత్ భార్య‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement