
టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తన కుమార్తెను హత్య చేసినందుకు ఆమె తండ్రి దీపక్ యాదవ్ కుమిలిపోతున్నాడని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తనను ఉరి తీయాలంటూ.. రాధికా యాదవ్ తండ్రి పశ్చాత్తాపం పడినట్లు దీపక్ యాదవ్ సోదరుడు చెప్పుకొచ్చారు. ఆవేశంలో హత్య చేశానని.. తనను ఉరి తీయాలని పోలీసులను కోరినట్లు ఆయన తెలిపారు.
ఈ కేసులో తండ్రి దీపక్ యాదవ్‌కు గురుగ్రామ్ కోర్టు 4 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆయన్ను కోర్టు నుంచి జైలుకు తరలించారు. రాధికా యాదవ్‌ను ఆమె తండ్రే హత్య చేశాడు. కిచెన్‌లో వంట పని చేస్తున్న రాధికా యాదవ్‌ను వెనుక నుంచి వెళ్లి తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. నాలుగు రౌండ్ల బుల్లెట్‌లు ఒంట్లోంచి దూసుకెళ్లడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందింది.
రాధికా యాదవ్ సొంతంగా టెన్నిస్ అకాడమీ నడుపుతుండటంతో ఇరుగుపొరుగు తనను కుమార్తె సంపాదనతో బతుకుతున్నావని హేళన చేస్తున్నారని, దాంతో అకాడమీని మూసివేయమని ఎంత చెప్పినా తన కుమార్తె వినిపించుకోలేదని.. అందుకే ఆమెను హత్య చేశానంటూ పోలీసుల విచారణలో దీపక్ యాదవ్ చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు, రాధిక ఇన్‌స్టాలో పెట్టిన ఓ రీల్ కూడా హత్యకు కారణమంటూ పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
కాగా, రాధికా యాదవ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కూతుర్ని ఆంక్షల నడుమ బంధించడానికి యత్నించే క్రమంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. రాధికా యాదవ్ టెన్నిస్ కోచ్‌లలో ఒకరైన అజయ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లోని కొన్ని పరిమితులు, ఆంక్షలతో రాధికా యాదవ్ సతమతమైనట్లు వెల్లడించారు. తనకు వాట్సాప్ చాట్ టెక్ట్స్ మెసేజ్‌లు, వాయిస్ చాట్‌లలో ఆమె చెప్పిన కొన్ని విషయాలను అజయ్ యాదవ్ జాతీయ మీడియాకు తెలిపారు.
ఇదీ చదవండి: రాధిక వాట్సాప్ చాట్‌లో సంచలన విషయాలు..!