
ప్రతి నాలుగు జంటల్లో ఒకరిలో స్థూలకాయం
పెళ్లయ్యాక ఆహారపు అలవాట్లలో మార్పే కారణం
ఒకరి ఇష్టాలు మరొకరు స్వీకరిస్తూ భోజనాలు
ఐసీఎంఆర్ అధ్యయనంలో ఆసక్తికర విషయాలు
చుక్క లాంటి అమ్మాయి, చక్కనైన అబ్బాయి! ఒకరితో ఒకరికి పెళ్లయింది. పెళ్లికి ముందు ‘ఎవరికి వారు’గా ఉన్నవారు, పెళ్లి తర్వాత ‘ఒకరి కోసం ఒకరు’ అన్నట్లుగా మారిపోయారు. మంచిదే కదా! మంచిదే కానీ.. వాళ్లలో మెల్లగా మార్పు మొదలైంది! గొడవలా? కాదు. మనస్ఫర్థలా? కాదు. ఉద్యోగాల్లో పడి ఒకరికొకరు టైమ్ ఇవ్వటం లేదా? కాదు.. కాదు! మరేంటి సమస్య? ఏంటంటే – ఇద్దరూ బాగా లావైపోయారు! అవునా!! అవును. దేశమంతటా ఇదే ధోరణి కనిపిస్తోందట! కలిసి తినటమే దంపతులను ఊబకాయులుగా మార్చేస్తోందట.
⇒ అయ్యో రామా, భార్యాభర్తలు కలిసి తినటం కూడా తప్పేనా? తప్పు కాదు కానీ, ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తమ ఆహారపు అలవాట్లు మార్చుకునే క్రమంలో ‘సయోధ్య’తో ఒకే రకమైన ఆహారం తీసుకోవటం వల్ల ఇద్దరూ కూడా క్రమేణా బరువు పెరిగే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐ.సి.ఎం.ఆర్.) అంటోంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (ఎన్.ఎఫ్.హెచ్.ఎస్.) దగ్గరున్న డేటాలో 50 వేలమందికి పైగా దంపతుల ఆహార అలవాట్ల వివరాలను విశ్లేషించిన ఐ.సి.ఎం.ఆర్., ఆ దంపతులలో 27.4 శాతం మంది అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నట్లు కనుగొంది. ఈ ధోరణి ప్రధానంగా పట్టణ, సంపన్న వర్గాలలోని దంపతులలో కనిపించిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
⇒ దంపతుల ఆహార స్వేచ్ఛ..: సాధారణంగా భారతీయ కుటుంబాలలో అందరికీ కలిపి ఒకే మెనూ ఉంటుంది. అన్నం, నూనెతో వండే కూరలు, వేపుళ్లు ఉంటాయి. అయితే పెళ్లయిన వారికి కొత్తగా ‘ఆహార స్వేచ్ఛ’ వస్తుంది. దంపతులలో ఎవరికి ఇష్టాలు వారికున్నా, ఒకరికి ఇష్టమైన దానికి మరొకరు ఇష్టపడటంతో ఇద్దరూ కలిపి ఒకే విధమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఈ కారణంగా దంపతులు లావయ్యే అవకాశం ఉందని ఐ.సి.ఎం.ఆర్. అధ్యయనం విశ్లేషించింది.
దాంపత్య భోజనంబు..
అధ్యయనంలోకి తీసుకున్న ప్రతి నాలుగు జంటల్లో ఒక జంట ఊబకాయులేనని ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది. భార్యాభర్తల్లో వివాహం ముందు వరకు ఆహారం, జీవనశైలుల విషయంలో ఎవరికి వారికి విభిన్న అభిరుచులు ఉంటాయి. వివాహం తర్వాత ఇదంతా మారిపోతుంది. ఆఫీస్‌లో పని ఒత్తిడి, ప్రయాణ అసలట వారి వారి ఆహారపు అలవాట్లను కలగాపులగం చేసేస్తాయి. ఇద్దరూ ఆర్డర్ పెట్టి ఫుడ్ తెప్పించుకోవటం ఎక్కువౌతుంది. ఒకరి కోసం ఒకరు మేల్కొని ఉండటం, లేట్ నైట్ ఆఫీస్ ప్రజెంటేషన్‌లు ఇవ్వటం, వారాంతపు విహారాలు.. ఇలాంటివన్నీ కలిసి దంపతుల జీవన శైలిని మార్చేస్తాయి. దాంతో సరైన నిద్రా, తగిన శారీరక శ్రమా లేకపోవటంతో 30ల వయసుకే దంపతులు లావైపోతున్నట్లు
ఐ.సి.ఎం.ఆర్. గుర్తించింది.
అతి పెద్ద అధ్యయనం
‘ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్’, ‘టెరి స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్’, ఇతర సంస్థల పరిశోధకులు కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించాయి. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే–5 (2019–21) దగ్గరున్న దేశవ్యాప్త డేటా నుంచి 52,737 జంటల ఆహార తీరుతెన్నులను, వారి ఆరోగ్యాలను విశ్లేషించారు. వారిలో 27.4 శాతం జంటల్లో ఊబకాయ స్థితి ఉండటాన్ని గమనించారు. ‘కరెంట్ డెవలప్‌మెంట్స్ ఇన్ న్యూట్రిషన్’లో ప్రచురణ అయిన ఈ అధ్యయన ఫలితాలు.. భారతదేశ దంపతులు కలిసి తింటూ, కలిసి బరువు పెరగటాన్ని గుర్తించింది. ఇది దేశంలోనే ఈ తరహా అతిపెద్ద అధ్యయనం.
ప్రథమ స్థానంలో కేరళ
అధ్యయనానికి ఎంచుకున్న అరలక్షకు పైగా జంటలలో ప్రధానంగా.. కేరళ, మణిపూర్, ఢిల్లీ, గోవా, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలలోని పట్టణ, సంపన్న కుటుంబాలకు చెందిన భార్యాభర్తలు లావు పెరగటం కనిపించింది. కేరళ దంపతులలో అత్యధికంగా 51.3 శాతం వరకు ఊబకాయులు ఉండగా ఆ శాతం జమ్మూ కశ్మీర్‌లో 48.5, మణిపూర్‌లో 47.9, ఢిల్లీలో 47.1, గోవాలో 45 శాతం, తమిళనాడులో 42.7, పంజాబ్‌లో 42.5గా ఉంది. అత్యంత ధనికులైన వారిలో దాదాపు సగం (47.6 శాతం) జంటల్లో అధిక బరువు లేదా ఊబకాయం కనిపించింది. పేదలలో అది కేవలం 10.2 శాతం మాత్రమే కావడం గమనార్హం.
ఇద్దరూ లావవటం ఎలా సాధ్యం?
భార్యాభర్తలు సాధారణంగా జన్యుపరంగా సంబంధం కలిగి ఉండరు. అయినప్పటికీ ఒకే విధమైన ఆరోగ్య పరిస్థితులలోకి – అది ఊబకాయం, రక్తపోటు, ఇతరత్రా – ఏదైనా కావచ్చు, ఇద్దరూ ఒకేలా ఎలా మారి పోతారు? దీనికి సమాధానంగా – ‘ఉమ్మడి జీవనశైలి (టీవీ చూడటం, వార్తా పత్రికలు చదవటం వంటి అలవాట్లను కూడా కలిపి), ఆహారం, సామాజిక–ఆర్థిక స్థితి, పర్యావరణం, భావోద్వేగ అంశాల కారణంగా ఇది జరుగుతుంది’ అని ఐ.సి.ఎం.ఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ ప్రధాన అధ్యయన రచయిత డాక్టర్ ప్రశాంత్ కుమార్ సింగ్ చెబుతున్నారు.