
ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు.. తమ నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్లూమ్ వ్యాపారవేత్త సచిన్ గ్రోవర్ (30).. ఆయన భార్య శివాని (28) తమ నాలుగు నెలల కుమారుడు ఫతేహ్.. ఇంటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు.
బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి.. కిటికీ గుండా చూసేసరికి, గదిలోని ఉరికి వేలాడుతూ భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండగా.. భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.
సూసైడ్ నోట్‌లో తమకున్న అప్పులు తీర్చడానికి తమ కారు, ఇల్లు అమ్మివేయాలని సచిన్ కోరారు. “నా కుటుంబంపై నాకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వారు నన్ను పూర్తిగా మద్దతు ఇచ్చారు. దయచేసి మా కారు, ఇల్లు అమ్మి అప్పులు తీర్చండి.. తద్వారా ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలి.” అంటూ సచిన్ తన సూసైడ్ నోట్‌లో రాశారు. సచిన్.. మంగళవారం సాయంత్రం తన తల్లితో మాట్లాడినప్పుడు.. రూ. 5 లక్షలు బ్యాంకు లోన్ కట్టాల్సి ఉందని.. కానీ రూ. 3 లక్షలు మాత్రమే సమకూర్చగలిగానని చెప్పాడని ఆయన తల్లి పేర్కొంది.
ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి, దంపతులు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారని.. వారి కుమారుడిని ముందుగా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.