
ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లపై అమిత్ షా ధ్వజం
తిరువనంతపురం: కేరళలోని అధికార సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌లపై బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం మంత్రి తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ రెండు పక్షాలు రాష్ట్రంలో అవినీతిని, బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నా యన్నారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) వంటి దేశ వ్యతిరేక శక్తులకు కేరళను సురక్షితమైన ప్రాంతంగా మార్చాయని మండిపడ్డారు.
శనివారం ఆయన తిరువనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రసంగించారు. పీఎఫ్‌ఐ అనుబంధ సంస్థలను కేంద్రం 2022లో చట్టవ్యతిరేక సంస్థలుగా ప్రకటించింది. కేరళలో పీఎఫ్‌ఐ సంస్థపై నిషేధం విధించే అధికారం ఉన్నా ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని, ఆ సంస్థ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఈ సందర్భంగా వామపక్ష ప్రభుత్వాన్ని అమిత్ షా ప్రశ్నించారు. ‘రాష్ట్రాభివృద్ధి బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏతో మాత్రమే సాధ్యం. దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా వికసిత్ భారత్ సాధ్యం కాదు. వికసిత్ కేరళమ్ మాత్రమే వికసిత్ భారత్‌కు మార్గమని చెప్పారు.
అందుకే, బీజేపీ లక్ష్యం ఇక నుంచి వికసిత్ కేరళమ్’ అని ఆయన పేర్కొన్నారు. కేరళలో పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండటం కంటే రాష్ట్రాన్ని వికసిత్‌కు కేంద్రంగా మార్చడం ముఖ్యమైన విషయమని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన వికసిత్ కేరళమ్ మిషన్ లోగోను ఆవిష్కరించారు. బీజేపీ, సీపీఎంలకు పార్టీ కేడర్ ఉన్నప్పటికీ ప్రధానమైన తేడా ఒకటుందని చెబుతూ ఆయన..బీజేపీ కేడర్ రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తే, సీపీఎం కేడర్ అభివృద్ధి కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించారు. 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని ప్రకటించారు. ఈ సందర్భంగా అమిత్ షా బీజేపీ రాష్ట్ర కమిటీ కార్యాలయం మరార్జీ భవన్‌ను
ప్రారంభించారు.