న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సార్థక్ పీడీఎస్ రేషన్ సరఫరా పథకం 2031 వరకు కొనసాగింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 16వ ఆర్థిక సంఘం కాలంలో ఈ పథకానికి 25,530 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. రూ.80 కోట్ల మంది ప్రజలకు రేషన్ సరఫరా అవుతుంది. ఈ పథకాన్ని అంబ్రెలా స్కీమ్‌గా కొనసాగించనున్నారు. ఆహార భద్రతా చట్టం కింద రేషన్ సరఫరా జరుగుతుంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆహార ధాన్యాల అంతర్రాష్ట్ర రవాణా, నిర్వహణ ఖర్చులు, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ ఖర్చుల భర్తీకి కేంద్ర సహాయ నిబంధనల్లో మార్పులు చేయాలని కూడా సీసీఈఏ నిర్ణయించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కేంద్ర సహాయ నిధుల విధానాన్ని కొనసాగించనున్నారు.
ఈ పథకం కింద ప్రస్తుతం అమల్లో ఉన్న రెండు పథకాలను ఏకీకృతం చేశారు. వాటిలో ఒకటి జాతీయ ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర సంస్థలకు ఆహార ధాన్యాల రవాణా, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్ సహాయం. రెండోది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌లో సాంకేతిక ఆధునికీకరణ, సంస్కరణల పథకం.
సార్థక్-పీడీఎస్ పథకం లక్ష్యాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రాల్లో ఆహార ధాన్యాల రవాణా, నిర్వహణ, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ల మార్జిన్‌కు స్థిర ఆర్థిక సహాయం అందించడం ఒకటి. ప్రజలకు చివరి దశ వరకు సేవలు సమర్థంగా చేరేలా, లీకేజీలు తగ్గేలా, ఆహార భద్రత బలోపేతం అయ్యేలా సమగ్ర, ప్రజాకేంద్రీకృత, సమన్వయ పీడీఎస్ వ్యవస్థను నిర్మించడం రెండోది.
సార్థక్-పీడీఎస్ పథకం కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతికతలతో పీడీఎస్ కార్యకలాపాలను ఆధునికీకరించనున్నారు.
రియల్‌టైమ్ పర్యవేక్షణ, కృత్రిమ మేధస్సు ఆధారిత ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు, విశ్లేషణ వ్యవస్థలు, డేటా ఆధారిత పర్యవేక్షణ కోసం రాష్ట్ర కమాండ్ కంట్రోల్ సెంటర్లు, అంతర్జాతీయ ప్రమాణాల ప్రక్రియలతో పీడీఎస్‌లో పారదర్శకత, భద్రత, స్థిరత్వం పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశ ప్రజలకు తగిన పరిమాణంలో నాణ్యమైన ఆహార ధాన్యాలు అందించి ఆహార, పోషక భద్రత కల్పించడం కేంద్ర ప్రభుత్వ సామాజిక, చట్టబద్ధ బాధ్యత అని కేంద్రం తెలిపింది. గత దశాబ్దంలో టీపీడీఎస్ పూర్తి కంప్యూటరీకరణ, ఐఎం-పీడీఎస్, స్మార్ట్ పీడీఎస్ వంటి డిజిటల్ కార్యక్రమాలను కేంద్రం అమలు చేసింది.
“మేరా రేషన్”, “అన్న మిత్ర”, “రైట్‌ఫుల్ టార్గెటింగ్ డ్యాష్‌బోర్డ్”, “అన్న సహాయత” వంటి ప్రజా సేవా యాప్‌లను కూడా ప్రవేశపెట్టింది. 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లో ఉన్న స్మార్ట్ పీడీఎస్ పథకం ద్వారా రేషన్ కార్డుల పూర్తి డిజిటలైజేషన్, ఆధార్ అనుసంధానం, ఈ-పీఓఎస్ ద్వారా ఫెయిర్ ప్రైస్ షాప్‌ల ఆటోమేషన్, ఆన్‌లైన్ కేటాయింపులు, కంప్యూటరీకృత సరఫరా వ్యవస్థలు 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమల్లోకి వచ్చాయి.
కాగా, దేశంలో కొనసాగుతున్న తీవ్ర వడగాలులపై క్యాబినెట్లో చర్చించారు. తీవ్రమైన ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఆయా మంత్రిత్వ శాఖలు చర్యలు తీసుకోవాలని చెప్పారు.


