
ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
రూ.24,000 కోట్లతో 100 జిల్లాల్లో పథకం
ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఆరేళ్లపాటు అమలు
పంటల ఉత్పత్తి, నిల్వ సామర్థ్యం పెంచడమే లక్ష్యం
దేశవ్యాప్తంగా 1.7 కోట్ల మంది రైతులకు లబ్ధి
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’కు ఆమోద ముద్రవేసింది. రూ.24,000 కోట్లతో రాబోయే ఆరేళ్లపాటు దేశవ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. పంటల ఉత్పత్తిని పెంచడమే పథకం లక్ష్యం. దీంతో 1.7 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమైంది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను ఈ ఏడాది అక్టోబర్‌లో రబీ సీజన్ నుంచే అమల్లోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మూడు సూచికల ఆధారంగా ఎంపిక
ధన్–ధాన్య కృషి యోజన అమలుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. శిక్షణ, అవగాహన కార్యక్రమాలు ఆగస్టులు ప్రారంభమవుతాయని చెప్పారు. 100 జిల్లాల్లో పంటల సాగు, ఉత్పత్తిపాటు గ్రామ స్థాయిలో పంటల నిల్వ సామర్థ్యాన్ని పెంచడం పథకం ఉద్దేశమని వివరించారు.
పొలాలకు నీటి సరఫరాను మెరుగుపర్చడం, రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం ఇందులో భాగమని అన్నారు. పంటల ఉత్పాదకత తక్కువగా ఉండటం, అన్ని రుతువుల్లోనూ పంటలు సాగు పెద్దగా లేకపోవడం, రుణ లభ్యత అత్యంత తక్కువగా ఉండటం అనే మూడు కీలక సూచికల ఆధారంగా 100 జిల్లాలను గుర్తిస్తామని స్పష్టంచేశారు. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక జిల్లాను ఎంపిక చేస్తామన్నారు.
గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి పెంచడానికి చర్యలు
ప్రస్తుతం అమల్లో ఉన్న 11 శాఖలకు సంబంధించిన 36 కేంద్ర పథకాలు, రాష్ట్ర పథకాల సమ్మేళనంతోపాటు ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో ‘ప్రధానమంత్రి ధన్–ధాన్య కృషి యోజన’ను అమలు చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెప్పారు. కేబినెట్ నిర్ణయాలను ఆయన మీడియాకు తెలియజేశారు. ఇంధన పరివర్తన ప్రయాణంలో కీలకమైన మైలురాయికి చేరుకున్నట్లు చెప్పారు.
శిలాజేతర ఇంధన వనరుల నుంచే 50 శాతం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని, నిర్దేశిత గడువు కంటే ఐదేళ్ల ముందే ఈ ఘనత సాధించామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని మరింత పెంచడానికి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ప్రభుత్వ రంగంలోని ఎన్‌టీపీసీ పెట్టుబడుల పరిమితిని రూ.20,000 కోట్లకు పెంచినట్లు చెప్పారు. పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో రూ.7,000 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్(ఎన్‌ఎల్‌సీఐఎల్)కు అనుమతి ఇచి్చనట్లు వివరించారు.
శుభాంశు శుక్లాకు అభినందనలు
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్‌ఎస్) వెళ్లి, క్షేమంగా తిరిగివచి్చన భారత వ్యోమగామి శుభాంశు శుక్లాను అభినందిస్తూ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించారు. భారత అంతరిక్ష కార్యక్రమాల్లో ఇదొక నూతన అధ్యాయమని ప్రశంసించారు. శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర సఫలం కావడం మన దేశానికి గర్వకారణమని తీర్మానంలో పేర్కొన్నారు.