న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, హీరో విజయ్‌కు సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న కరూర్ తొక్కిసలాట కేసు దర్యాప్తుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై సోమవారం ఢిల్లీలోని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.
కరూర్‌లో విజయ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు.
తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. అధికార డీఎంకే కుట్రగా ఆరోపణలు గుప్పించారు. పోలీసులే సరైన క్రౌడ్‌మేనేజ్మెంట్ చేయలేకపోవడం, రహదారులపై ట్రాఫిక్ నియంత్రించ లేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అన్నారు.
ఈ ఘటన తమిళనాడులో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఈ కేసు ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


