చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తమిళనాడులో రాజ్యసభకు జరగనున్న ఉప ఎన్నికలో అధికార టీవీకే పార్టీ ఆ సీటును కాంగ్రెస్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీవీకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం విజయ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ టీవీకేతోపాటు కూటమిలోని పార్టీలు ఇందుకు అంగీకారం తెలిపాయి. ఇక, ఈ నెల 18న రాజ్యసభ ఉప ఎన్నిక జరగనుంది.
ఇదిలా ఉండగా.. అన్నాడీఎంకే తరఫున రాజ్యసభలో ఎంపీగా కొనసాగిన సీవీ షణ్ముగం.. తమిళనాడు ఎన్నికల సందర్భంగా రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మైలాం అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. దీంతో షణ్ముగం తన రాజ్యాసభ పదవికి మే 7న రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఇప్పుడు ఉప ఎన్నిక జరగనుంది. ఇందులో ప్రధాన పోటీదారుగా కాంగ్రెస్ ఉండనుంది. అధికార టీవీకే కూటమి మద్దతు ఉండటంతో కాంగ్రెస్‌కు విజయావకాశాలున్నాయి.
కాగా, తమిళనాడులో టీవీకేకు మద్దతు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యసభ సీటు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 8 వరకు, ఉదయం 11.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన జూన్ 9 నుంచి ప్రారంభమవుతుంది. జూన్ 11 వరకు నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంది. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూన్ 18న ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా పీ తెన్మోళి కొనసాగనున్నారు.


