
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో త్రిపురకు చెందిన యువతి స్నేహ దేబ్‌నాథ్(19) అదృశ్యమయ్యింది. విషయం తెలుసుకున్న త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆమె ఆచూకీ కోసం వెంటనే ప్రయత్నాలు ప్రారంభించాలని పోలీసులకు పలు సూచనలు చేశారు.
త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో, ‘న్యూఢిల్లీలో త్రిపురలోని సబ్రూమ్‌కు చెందిన స్నేహ దేబ్‌నాథ్ అదృశ్యమైనట్లు తమ కార్యాలయం దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె ఆచూకీ కోసం తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు అవసరమైన సూచనలు జారీ చేశాం’ అని పేర్కొన్నారు. అనుమానాస్పద పరిస్థితుల్లో దేబ్‌నాథ్ అదృశ్యమైన దరిమిలా త్రిపుర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఢిల్లీ పోలీసులు.. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్)నేతృత్వంలో ఆమె ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆత్మ రామ సనాతన ధర్మ కళాశాలో చదువుకుంటున్న స్నేహ చివరిసారిగా జూలై 7న తన కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఆరోజు ఆమె తన స్నేహితురాలు పితునియాతో కలిసి సారాయ్ రోహిల్లా రైల్వే స్టేషన్‌కు వెళ్తున్నట్లు తల్లికి తెలిపారు. అదే ఆమె చివరి ఫోన్ కాల్. ఇది ఉదయం 5:56 గంటలకు వచ్చింది. ఆ తరువాత ఉదయం 8:45 గంటలకు ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది.దీంతో ఆమె కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. ఆ రోజు స్నేహను క్యాబ్ డ్రైవర్ స్నేహను ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జి దగ్గర దింపినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో నిఘా ఫుటేజ్ లేకపోవడంతో స్నేహ తుది కదలికలను తెలుసుకోవడం పోలీసు అధికారులకు సాధ్యంకాలేదు. జూలై 9న ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ఎన్‌డీఆర్‌ఎఫ్ సాయంతో సిగ్నేచర్ బ్రిడ్జి ప్రాంతంలో విస్తృతమైన పరిశీలన చేసింది. అయితే స్నేహకు సంబంధించిన ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు.స్నేహ తన వెంట ఎటువంటి వస్తువులు తీసుకువెళ్లలేదని, గత కొద్దిరోజులుగా డబ్బు విత్‌డ్రా చేయలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. స్నేహ ఆచూకీ తెలిసినవారు తమకు తెలియజేయాలని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.