బెంగళూరు రాజేశ్వరి నగర్‌లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. సుమంత్ జైన్ (32), పద్మావతి (29) నగరంలోని రాజేశ్వరి నగర్‌లో నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. సుమంత్ నందిని లేఅవుట్‌లోని ఒక సంస్థలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తుండగా, పద్మావతి వైట్‌ఫీల్డ్‌లోని ఒక టెక్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ వివాహమై నాలుగేళ్లు అవుతోంది, వీరికి సంతానం లేదు.
గురువారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో సుమంత్ తన తల్లికి వాట్సాప్‌లో ఒక వాయిస్ మెసేజ్ పంపారు. ఆ మెసేజ్ ఈ కేసులో కీలకంగా మారింది. ‘ఈ ఇల్లు నాది’ అని పద్మావతి అనడంతో తమ మధ్య గొడవ జరిగిందని, ఆవేశంలో తాను తన జీవితాన్ని ముగించుకుంటున్నానని సుమంత్ ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. అలాగే తన ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు, ఇంట్లో ఉన్న వస్తువులను చూసుకోవాలని తల్లికి సూచించారు.
పోలీసుల దర్యాప్తు
వాయిస్ మెసేజ్ విన్న సుమంత్ కుటుంబ సభ్యులు ఆందోళన చెంది, వెంటనే వారికి ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో, ఇంటికి వెళ్లి చూడగా వారు మరణించి ఉన్నారు. పద్మావతి మృతదేహం నేలపై ఉండగా, సుమంత్ ఉరివేసుకుని కనిపించారు. పద్మావతిని తన భర్తే చంపాడని, ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన నార్త్-వెస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ నాగేష్ డి.ఎల్ మాట్లాడుతూ, పద్మావతిది హత్యేనా లేక ఆమె కూడా ఆత్మహత్య చేసుకుందా అనే అంశంపై విచారణ చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు వెల్లడవుతాయని తెలిపారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


