లైఫ్‌స్టైల్
ఇంట్లో చిన్నచిన్న పనులను పెండింగ్‌లో పెడితే.. అవే తర్వాత పెద్ద పనులుగా మారిపోతాయి. దీంతో గందరగోళం పెరగడమే కాదు, మనసుపై కూడా ఒత్తిడి పడుతుంది. దీనికి పరిష్కారమే.. 10 నిమిషాల రూల్.
అంటే దీని ప్రకారం.. ఇంట్లో ఏదైనా చిన్న పని కనిపిస్తే దాన్ని తర్వాతకు వాయిదా వేయకుండా వెంటనే కొన్ని నిమిషాలు కేటాయించి పూర్తి చేయాలి. వంటగది కౌంటర్ శుభ్రం చేయడం, సోఫాపై ఉన్న వస్తువులను వాటి స్థానాల్లో పెట్టడం, బట్టలు సర్దడం, పాత్రలను సింక్‌లో పేరుకుపోకుండా చూడటం వంటివి.
పది నిమిషాలే ఎందుకు?
గంటల తరబడి ఇంటిని శుభ్రం చేయాలనే ఆలోచన చాలామందికి భారంగా అనిపిస్తుంది. కానీ కేవలం పది నిమిషాలు మాత్రమే కేటాయించాలనుకుంటే పని సులభంగా అనిపిస్తుంది. ఇలా రోజూ కొద్దిసేపు చేస్తే ఇంట్లో పనులు పేరుకుపోకుండా ఉంటాయి.
మనసుకూ ప్రశాంతతే..
చుట్టూ వస్తువులు చిందరవందరగా ఉన్నప్పుడు కొందరికి అసౌకర్యంగా అనిపించవచ్చు. వస్తువులను సర్దుకోవడం, చిన్న పనులను వెంటనే పూర్తి చేయడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దీంతో రోజువారీ పనులను నిర్వహించుకోవడం కూడా సులభమవుతుంది.
రోజులో కేవలం పది నిమిషాలు చిన్న పనులకు కేటాయించడం ద్వారా ఇంట్లో గందరగోళాన్ని తగ్గించుకోవచ్చు. ఇల్లు సర్దితే.. మనసూ కాస్త తేలికవుతుంది!
ఇదీ చదవండి: పాత న్యూస్ పేపర్లు పడేయకండి.. ఇలా చేస్తే స్టైలిష్ బ్యాగ్స్ రెడీ!


