బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్‌ను ఆదరించండి
బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపు
సింగూర్: ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదార్లను కాపాడుతూ దేశ భద్రతతో ఆటలాడుతున్న తృణమూల్ కాంగ్రెస్ పారీ్టకి బుద్ధి చెప్పాలని పశ్చిమబెంగాల్ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొల్పాలంటే ‘మహా జంగిల్‌రాజ్’ను అంతం చేయాల్సిందే. అభివృద్ధి కావాలన్నా, పెట్టుబడిదారులను ఆకర్షించాలన్నా తృణమూల్‌ను చిత్తుగా ఓడించాల్సిందే’’ అన్నారు. మోదీ ఆదివారం హుగ్లీ జిల్లాలోని సింగూర్‌లో పర్యటించారు.
రూ.830 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మూడు వందేభారత్ రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మహా జంగిల్‌రాజ్‌కు, బీజేపీ సుపరిపాలనకు పోరు జరగనుందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లతో స్థిరపడిన చొరబాటుదార్లను తాము అధికారంలోకి రాగానే వెనక్కి పంపిస్తామని పునరుద్ఘాటించారు. బీజేపీ డబుల్ ఇంజన్ మోడల్‌ను ఆదరించాలని ప్రజలను కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం కలి్పస్తామన్నారు.
అరాచక ప్రభుత్వాన్ని శిక్షించాలి
‘‘బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చొరబాట్లు విపరీతంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో సరిహద్దుల్లో కంచె నిర్మాణం ఆగిపోయింది. చొరబాటుదార్లు ప్రభుత్వ సహకారంతో తప్పుడు పత్రాలు సృష్టించి, ఇక్కడే తిష్టవేస్తున్నారు. వారిని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం నిస్సిగ్గుగా కాపాడుతోంది. మేమొచ్చాక వారందరినీ ఏరేస్తాం. బెంగాలీల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్న అరాచక ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షించాలి.
అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకుంటున్న ప్రభుత్వాలను ప్రజలు పూర్తిగా తిరస్కరిస్తున్నారు. దేశమంతటా ఈ ధోరణి కనిపిస్తోంది. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా నిలిపివేసిన ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం బెంగాల్‌లో అమలు కావడం లేదు. పేద ప్రజలు నష్టపోతున్నారు. వారంతా తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడం ఖాయం. మేము వచ్చాక ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తాం.
ఇదీ నా గ్యారంటీ
తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియా నాయకులు, సిండికేట్లు, నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ప్రజలను పీడిస్తున్నారు. ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారు. బీజేపీ పాలనలో వారి ఆట కట్టిస్తాం. ప్రజలకు సుపరిపాలన అందిస్తాం. ఇదీ నా గ్యారంటీ. సిండికేట్ రాజ్ ఆగడాలు తట్టుకోలేక పరిశ్రమలు వెళ్లిపోయాయి. తృణమూల్ కాంగ్రెస్ నాయకులు సొంత సామ్రాజ్యాలు సృష్టించుకున్నారు.
సిండికేట్ రాజ్, మాఫియా సంస్కృతిని అంతం చేయడమే మా లక్ష్యం. రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. సందేశ్‌కాళీలో భూములు ఆక్రమించారు. టీచర్ల నియామకంలో భారీగా అవినీతి జరిగింది. విద్యా వ్యవస్థను మాఫియాలు నియంత్రిస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇలాంటివి ఆగిపోతాయి. మహిళలు, యువత, రైతులకు తృణమూల్ కాంగ్రెస్ శత్రువులా మారింది. వారి జీవితాలతో చెలగాటం ఆడుతోంది’’ అన్నారు.
చొరబాటుదార్లకు కాంగ్రెస్ అండ
కలియాబోర్: కాంగ్రెస్ పారీ్టపై ప్రధాని మోదీ మరోసారి నిప్పులు చెరిగారు. అస్సాంలో ఆ పార్టీ హయాంలో ఓట్ల కోసం భూములను చొరబాటుదార్లకు కట్టబెట్టిందని మండిపడ్డారు. దాంతో చొరబాటుదార్ల జనాభా విపరీతంగా పెరిగిపోయిందన్నారు. వారు భూములు, అడవులను విచ్చలవిడిగా ఆక్రమించుకున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక చొరబాటుదార్లను ఖాళీ చేయిస్తున్నట్లు తెలిపారు. అస్సాంలోని నాగావ్ జిల్లాలో రూ.6,957 కోట్ల విలువైన కజిరంగా ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు మోదీ ఆదివారం పర్యటించారు.
శంకుస్థాపన చేశారు. రెండు అమృత్‌భారత్ రైళ్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. ‘‘చొరబాటుదారులు అస్సాం సంస్కృతిపై దాడి చేస్తున్నారు. స్థానిక యువత ఉపాధిని కొల్లగొడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లో భూములు కబ్జా చేస్తున్నారు. చొరబాటుదార్ల కారణంగా అస్సాంకే కాకుండా మొత్తం దేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది. చొరబాటుదార్లను కాపాడి అధికారం దక్కించుకోవడమే కాంగ్రెస్ విధానంగా మారిపోయింది. చొరబాటుదార్లకు మద్దతుగా బిహార్‌లో ర్యాలీలు నిర్వహించిన కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారు. అస్సాంలోనూ కాంగ్రెస్ కూటమికి అదే గతి పడుతుంది. కాంగ్రెస్‌కు అభివృద్ధి అజెండా అనేదే లేదు. ప్రతికూల రాజకీయాలతో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది’’ అన్నారు.


