
న్యూఢిల్లీ: ఇండియా నుంచి ఇరాన్ వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమయ్యారు. వారు అపహరణకు గురైనట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీకి సమాచారం చేరవేశారు. ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టాలని కోరారు. దీనిపై ఇండియన్ ఎంబసీ వెంటనే స్పందించింది. ముగ్గురు భారతీయులు జాడ తెలియకుండా పోయారని, వారు ఎక్కడున్నారో గుర్తించాలని, వారి భద్రతకోసం చర్యలు తీసుకోవాలని ఇరాన్ ప్రభుత్వానికి బుధవారం విజ్ఞప్తి చేసింది.
అలాగే గాలింపు చర్యలపై బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తోంది. ఇరాన్‌లో అదృశ్యమైన పంజాబ్ యువకుడి తల్లి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 1వ తేదీన తన కుమారుడిని దుండగులు కిడ్నాప్ చేశారని, అతడిని ప్రాణాలతో వదిలేయాలంటే డబ్బులు ఆవ్వాలని డిమాండ్ చేశారని చెప్పారు. ఇరాన్‌లో కనిపించకుండా పోయిన ముగ్గురు యువకులు పంజాబ్‌కు చెందినవారే. వర్క్ పర్మిట్‌పై ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరారు.
ఆ్రస్టేలియాకు చేరుకోవాల్సి ఉండగా, ఏజెంట్లు వారిని ఇరాన్‌కు చేర్చినట్లు తెలుస్తోంది. అక్కడే వారు కిడ్నాప్ అయినట్లు సమాచారం. ట్రావెల్ ఏజెంట్లు తమవద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని, తన కుమారుడిని డంకీ రూట్‌లో ఇరాన్‌కు తీసుకెళ్లారని యువకుడి తల్లి హసన్‌ప్రీత్ చెప్పారు. కిడ్నాపర్లు ఫొటోలు, వీడియోలు పంపించారని, అందులో ముగ్గురు యువకుల చేతులను తాళ్లలో కట్టేసినట్లు కనిపిస్తోందని అన్నారు. అంతేకాకుండా వారి శరీరాలపై గాయాలు ఉన్నాయని తెలిపారు. కిడ్నాప్ అయిన తర్వాత కొన్నిరోజులపాటు యువకులతో వారి కుటుంబ సభ్యులు మాట్లాడారు. ఈ నెల 11 నుంచి ఫోన్‌కాల్స్ ఆగిపోయాయి.