
డెహ్రాడూన్: అతి తెలివి అనర్థాలకు దారితీస్తుందంటారు. ఈ మాటను పెడచెవిన పెట్టినవారు ఇబ్బందుల్లో పడటాన్ని మనం చూస్తుంటాం. ఇదే కోవలో ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకు, కొందరు టూరిస్టులు ఎంతో తెలివిగా వేసిన ప్లాన్ చివరికి బెడిసికొట్టింది. వారు చేసిన పని పోలీసుల వరకూ చేరింది. విషయం తెలిసినవారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు.
హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి బయలు దేరిన కొందరు టూరిస్టులు రెండు అంబులెన్స్‌లను బుక్ చేసుకుని ,వాటిని టాక్సీలుగా మార్చివేశారు. ట్రాఫిక్‌ను తప్పించుకునేందుకే వారు ఈ పని చేశారు. అయితే చివరికి వారు పోలీసుల దృష్టి మళ్లించలేకపోయారు. వారు టాక్సీలుగా ఉపయోగించిన రెండు అంబులెన్స్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి డ్రైవర్లకు చలానా వడ్డించారు.
జూన్ 14న కొందరు భక్తులు హరిద్వార్ నుండి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లేందుకు రెండు అంబులెన్స్‌లను బుక్ చేసుకున్నారు. వాటిలో వెళితే ట్రాఫిక్ బారినపడకుండా సులభంగా పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చనుకున్నారు. రోగులను ఆసుపత్రికి తరలించడానికి ఉపయోగించే అత్యవసర సేవా వాహనం అయిన అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకోరని వారు భావించారు. తరువాత వారంతా అంబులెన్స్‌లలో ఎక్కి, సైరన్‌లను ఆన్ చేసి, ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
సోన్‌ప్రయాగ్ వరకూ వారు అన్ని చెక్‌పోస్టులను దాటారు. అయితే సోన్‌ప్రయాగ్‌లోని చెక్‌పోస్టు సిబ్బందికి ఆ మార్గంలో రెండు అంబులెన్స్‌లు వస్తున్నట్లు ముందస్తు సమాచారం లేదు. దీంతో వారు ఆ అంబులెన్స్‌లను అడ్డుకున్నారు. వాటిలో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులు ఉండటాన్ని వారు గమనించారు. వాటిలోని ఒక అంబులెన్స్ రాజస్థాన్ నంబర్‌తో ఉండగా, రెండవది హరిద్వార్ నంబర్‌తో ఉంది. ఈ రెండు వాహనాలను మోటారు వాహనాల చట్టం కింద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వాహనాల డ్రైవర్లకు జరిమానా విధించారు. కేదార్‌నాథ్ ద్వారాలు మే 2న తెరిచారు. నవంబర్‌లో జరిగే ముగింపు వేడుక వరకు ఆలయం తెరచి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Himachal: 200 అడుగుల లోయలో పడిన బస్సు.. ఇద్దరు మృతి