మహిళకు నార్మల్ డెలివరీ చేసిన 108 సిబ్బంది
తల్లీ బిడ్డ సురక్షితం..
కరీంనగర్ జిల్లా: ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగినప్పటికీ ఒక మహిళకు సుఖప్రసవం చేసిన కరీంనగర్ జిల్లా వీణవంక 108 సిబ్బందిపై అభినందనలు కురుస్తున్నాయి. తల్లీబిడ్డను క్షేమంగా ఆస్పత్రిలో చేర్చారు. స్థానికుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం సీతారాంపల్లికి చెందిన చిర్రకుంట మౌనిక (22) తొలిసారి గర్భం దాల్చింది. ప్రసవం కోసం మంచిర్యాలలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆదివారం పురిటి నొప్పులు రావడంతోపాటు.. ప్లేట్‌లెట్స్ 39 వేలకు పడిపోయినందున హనుమకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు.
దీంతో కుటుంబ సభ్యులు ఆమెను వీణవంకకు చెందిన 108 అంబులెన్స్‌లో హనుమకొండకు బయల్దేరారు. మార్గమధ్యలో మౌనికకు నొప్పులు తీవ్రమయ్యాయి. బిడ్డ కాళ్లు బయటికి వచ్చినా.. తల ఇరుక్కుపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఈఎంటీ బక్కతట్ల అయిలయ్య చాకచక్యంగా వ్యవహరించి ఆమెకు పురుడు పోశాడు. అనంతరం తల్లీబిడ్డను సురక్షితంగా హనుమకొండలోని జీఎంహెచ్ ఆసుపత్రిలో చేర్చారు. బాధితురాలి భర్త వంశీ.. 108 ఉద్యోగి అయిలయ్యతోపాటు పైలట్ శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


