
తేజస్వీ యాదవ్ ఆరోపణ
అలాందేమీ లేదంటూ స్క్రీన్‌షాట్ షేర్ చేసిన ఈసీ
పట్నా: ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన బిహార్ ఓటరు ముసాయిదా జాబితాలో తన పేరు గల్లంతైందని ప్రతిపక్ష ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. తనకు కేటాయించిన ఎపిక్ నంబర్ సైతం మారిందన్నారు. ఎపిక్ నంబర్ ఆధారంగా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో తన పేరు కోసం సోధించగా ‘నో రికార్డ్స్ ఫౌండ్’అని సూచిస్తోందని ఆరోపించారు. మా ఏరియాకు వచ్చిన బూత్ లెవల్ అధికారి తాను నింపి అందజేసిన ఎన్యుమరేషన్ ఫారానికి సంబంధించి ఎలాంటి రిసిప్టును ఇవ్వలేదన్నారు.
ఎన్యు మరేషన్ ఫారంలను బూత్ లెవల్ అధికారి ఇచ్చేటప్పుడు తన ఫొటోను తానే తీసుకున్నానన్నారు. ‘ఇప్పుడు చూడండి.. నా పేరు ఓటరు జాబితాలో నమోదు కాలేదు. దీంతో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉండదు. దేశ పౌరుడిగా నేను గుర్తింపు పొందలేదు. మా ఇంట్లో ఉండే హక్కు కూడా లేదు’అని ఆయన చెప్పుకొచ్చారు. తమ వంటి వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల విషయం ఎవరు పట్టించు కుంటారంటూ ఈసీపై ఆయన ధ్వజమెత్తారు. తేజస్వీ వ్యాఖ్యలను ఈసీ తీవ్రంగా ఖండించింది. ‘ఓటరు జాబితాలో ఆయన పేరుంది. గతంలో మాదిరిగా వెటరినరీ కాలేజీలోని బూత్‌లోనే ఆయన పేరుంది. ఇదే సాక్ష్యం.. అంటూ జాబితాలో ఆయన పేరున్న జాబితా ఫొటో స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది.