ఈ ఐదుగురు.. స్కూలు టీచర్లు కాదు.. కానీ ఉత్తమ ఉపాధ్యాయులు! | Sakshi
Sakshi News home page

teachers day: విద్యాదానం వీరి జీవన విధానం!

Published Tue, Sep 5 2023 1:57 PM

Teachers Day 5 Peoples Teaching Poor Children for Free - Sakshi

నిరుపేదలకు ఆర్ధిక సహాయం చేయడం, వారికి ఆహారం ఇవ్వడం లాంటివి చాలామంది చేస్తుంటారు. కానీ వీటన్నింకంటే గొప్ప దానం విద్యాదానం. చదువుకునేందుకు తాపత్రయ పడేవారికే విద్యకున్న నిజమైన ప్రాముఖ్యత బాగా తెలుస్తుంది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తమ జ్ఞానాన్ని తమ వద్దే ఉంచుకోవడమే కాకుండా ఇతరులకు పంచే బాధ్యతను కూడా తీసుకున్న కొంతమంది ఉపాధ్యాయుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ముఖేష్ పిథోరా: విద్య విలువ తెలుసుకుని.. 

ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌కు చెందిన ముఖేష్ పిథోరా పేద, నిస్సహాయస్థితిలో ఉన్న పిల్లల కోసం తన సమయాన్ని, జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు ముఖేష్. నిరుపేద కుటుంబం నుండి వచ్చిన ముఖేష్ అనేక సమస్యలను ఎదుర్కొంటూనే విద్యను అభ్యసించారు. పలువురు పేద పిల్లలు విద్యను అభ్యసించడానికి తగిన వనరులు లేని కారణంగా విద్యారంగంలో ముందుకు సాగలేకపోతున్న విషయాన్ని ఆయన గమనించారు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఉచిత విద్యను అందించాలని ముఖేష్‌ నిర్ణయించుకున్నారు. ఫిరోజాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తన వద్దకు వచ్చే పేద, నిస్సహాయ పిల్లలకు విద్యా తరగతులు నిర్వహిస్తుంటారు. ఇందుకోసం వారినుంచి ఎటువంటి రుసుము వసూలు చేయరు.

 అరుప్ ముఖర్జీ: సొంత సొమ్ముతో పాఠశాల 

ట్రాఫిక్ కానిస్టేబుల్ అరూప్ ముఖర్జీ 1999లో కోల్‌కతా పోలీస్ ఫోర్స్‌లో చేరారు. తన చిన్ననాటి కలను నెరవేర్చుకునేందుకు పొదుపు చేయడం మొదలుపెట్టారు. తన 6 సంవత్సరాల వయస్సులోనే పాఠశాల ప్రారంభించాలని కలలు కన్నారు. 43 ఏళ్ల అరూప్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తన డ్యూటీ చేయడమే కాకుండా, పేద గిరిజన పిల్లలకు పునరావాసం కూడా కల్పిస్తున్నారు. ముఖర్జీ ఏర్పాటు చేసిన పుంచ నబాదిశ మోడల్ స్కూల్ 126 మంది సబర్ పిల్లలకు వసతి, ఆహారం, ప్రాథమిక విద్యను ఉచితంగా అందిస్తుంది. ముఖర్జీ ఈ పాఠశాలను 2011లో నిర్మించారు. కోల్‌కతాకు 280 కి.మీ దూరంలో ఉన్న పుంచ గ్రామంలోని ఈ పాఠశాలకు రూ.2.5 లక్షల ప్రాథమిక నిధి తన సొంత పొదుపు నుంచి ముఖర్జీ వెచ్చించారు. దాతలు విరాళంగా ఇచ్చిన స్థలంలో ఈ పాఠశాలను నిర్మించారు. అరూప్ తన జీతంలో ప్రతీనెల రూ.20 వేలు స్కూల్ కోసం వెచ్చిస్తున్నారు. వ్యవసాయంతో వచ్చే ఆదాయంతో అతని కుటుంబం బతుకుతోంది. 

డాక్టర్ భరత్ శరణ్‌: వైద్యులను తీర్చిదిద్దుతూ..

రాజస్థాన్‌కు చెందిన డాక్టర్ భరత్ శరణ్ ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ఈ కోచింగ్ సెంటర్‌లో 11వ తరగతికి చెందిన వెనుకబడిన 25 మంది విద్యార్థులకు, 12వ తరగతి చదువుతున్న 25 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. డాక్టర్ శరణ్ మీడియాతో మాట్లాడుతూ తాను గత 7 సంవత్సరాలుగా ఈ కోచింగ్‌సెంటర్‌ నడుపుతున్నానని తెలిపారు. అతని ఇన్‌స్టిట్యూట్‌లో చదివిన 30 మందికి పైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్‌ పొందారు. ఐదుగురు ఎయిమ్స్‌లో పనిచేస్తున్నారు. కొందరు వెటర్నరీ మెడిసిన్‌లో ఉన్నారు. మరికొందరు ఆయుర్వేద రంగంలో కొనసాగుతున్నారు.

కానిస్టేబుల్ వికాస్ కుమార్‌: గ్రామంలోని పేద పిల్లలకు..

ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు  చెందిన పోలీస్‌ కానిస్టేబుల్ వికాస్ కుమార్ దేశ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. తన డ్యూటీకి సమయం కేటాయిస్తూనే, పేద పిల్లలకు ఉచితంగా చదువు చెప్పిస్తున్నారు. 2014 నుంచి తన గ్రామంలోని పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్నారు. తనకు 18 ఏళ్లు ఉన్నప్పటి నుంచి ఆయన ఈ మహోత్కార్యం చేస్తున్నారు. తల్లిదండ్రుల పేదరికం కారణంగా పిల్లలు చదువుకోలేకపోతున్నారని, ఇలాంటి పిల్లలకు చదుపు చెప్పించే బాధ్యతను తీసుకున్నానని వికాస్‌ కుమార్‌ తెలిపారు.

కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్: తన కలను స్టూడెంట్స్‌ నెరవేరుస్తారని..

ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాకు చెందిన కానిస్టేబుల్ మహ్మద్ జాఫర్ తన డ్యూటీ ముగియగానే రోజూ పేద పిల్లలకు ఉచితంగా చదువు చెబుతుంటారు. జాఫర్ తాను పనిచేస్తున్న పోలీస్ స్టేషన్‌ పక్కనే ఉన్న చెట్టుకింద పాఠశాల నడుపుతున్నారు. ఈ పోలీస్ స్కూల్‌కు ఒకటి నుంచి 10వ తరగతి వరకు చదువుకునే పిల్లలు ట్యూషన్ కోసం వస్తుంటారు. నవోదయ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధమవుతున్న పిల్లలు కూడా ఈ స్కూల్లో కోచింగ్‌ తీసుకుంటారు. జాఫర్ సైన్స్ గ్రాడ్యుయేట్, సివిల్ సర్వీసెస్‌లో చేరాలనేది అతని కల. కానీ అతని కల నెరవేరలేదు. తాను చదువు నేర్పుతున్న పిల్లల్లో ఎవరో ఒకరు తన కలను నెరవేర్చుకుంటారని జాఫర్‌ చెబుతుంటారు. 
ఇది కూడా చదవండి: ‘డూమ్స్‌డే క్లాక్‌’ అంటే ఏమిటి? 1947లోనే యుగాంతానికి దూరమెంతో తెలిసిపోయిందా?

Advertisement
 
Advertisement