Russia Ukraine War: ఉక్రెయిన్‌ సైన్యంలో చేరిన సాయి.. త్వరలో భారత్‌కు..

Tamil Nadu Student Sainikeshn He Return To India Soon Says His Father - Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా మిలిటరీ దాడులు చేస్తున్న క్రమంలో భారత్‌లోని తమిళనాడుకు చెందిన విద్యార్థి సాయినికేష్.. ఉక్రెయిన్‌ పారామిలటరీ బలగాల్లో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆ విద్యార్థి త్వరలో స్వదేశానికి రానున్నట్లు అతని తండ్రి రవిచంద్రన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూరు చెందిన ఆర్ సాయినికేష్.. ఉక్రెయిన్‌ ఖార్కివ్‌లోని నేషనల్ ఏరోస్పేస్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఉక్రెయిన్‌లో రష్యా దాడులు ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్‌ పారామిలిటరీ యూనిట్ జార్జియన్ నేషనల్ లెజియన్‌లో చేరాడు.

తాజాగా తన కుమారుడు సాయినికేష్ త్వరలో భారత్‌ తిరిగి రానున్నాడని తెలిపారు. తమతో కేంద్ర ప్రభుత్వ అధికారులు టచ్‌లో ఉన్నారని.. సాయినికేష్‌ను ట్రేస్‌ చేసి, స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపారని చెప్పాడు. మూడు రోజుల క్రితం సాయినికేష్‌తో అతని తండ్రి రవిచంద్రన్‌ ఫోన్‌లో మాట్లాడిన క్రమంలో స్వదేశానికి తిరిగి రావడానికి అంగీకరించినట్లు తెలిపాడు. ఏ క్షణమైన సాయి ఎక్కడున్నాడనే విషయం తెలుస్తుందని అధికారులు తమకు వెల్లడించారని చెప్పాడు. త్వరలోనే తమ కుమారుడు తిరిగి భారత్‌కు తిరగి వస్తాడని రవిచంద్రన్‌ తెలిపారు.

ఉక్రెయిన్‌కు వెళ్లకముందు గతంలో సాయినికేష్ ఇండియన్ ఆర్మీలో చేరడానికి దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించబడ్డ విషయం తెలిసిందే. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ఉధృతమవుతున్నాయి. ఉక్రెయిన్‌ సైనికులతోపాటు స్థానికుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ రష్యా సైన్యం 18వ రోజు సైతం దాడులు కొనసాగిస్తోంది. కీలక నగరాలపై పట్టు సాధించడానికి గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top